గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By chitra
Last Updated : బుధవారం, 13 జనవరి 2016 (17:02 IST)

అదేపనిగా రంగులేస్తున్నారా.. అయితే మీ జుట్టు పొడిబారిపోతుంది!

ఫ్యాషన్ పేరుతో జుట్టుకు తరచుగా రకరకాల రంగులు వేసుకోవడం ఈనాటి యువతులకు అలవాటైపోయింది. ఆహార్యంలో ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకోవటం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరిగే మాట ఏలా ఉన్నా... అన్నివేళలా జుట్టుకు రంగులు వేయటం అంత శ్రేయస్కరం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
అందుకే ఈనాటి యువతులు ఫ్యాషన్‌కు ఎంతగా ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ... జట్టుకు రంగులు వేసుకోవడాన్ని మాత్రం కొన్ని ప్రత్యేక సందర్భాలకు మాత్రమే పరిమితం చేయాలి. లేకపోతే... తలకు తరచూ రకరకాల రంగులు వేసుకోవటం వల్ల జుట్టు పొడిబారిపోయే ప్రమాదం పొంచి ఉంది. 
 
అన్నింటికంటే ముఖ్యంగా... కురుల్లో సహజత్వం పోవడమే గాకుండా, కొన్నాళ్లకు జీవం కూడా కోల్పోతాయి. అందుకే రసాయనాలతో కూడిన రంగులు వేసుకోవడాన్ని బాగా తగ్గించాలి. ఫ్యాషన్ కూడా అవసరమే కాబట్టి, అన్నివేళలా తలంతా రంగులు వేసుకోవడానికి బదులుగా ఒకసారి జుట్టు చివర్లు... మరోసారి కేవలం ఒక పాయకు మాత్రమే రంగు వేసుకునేందుకు ప్రయత్నించండి.
 
జుట్టు పొడిబారకుండా ఉండేందుకు కొబ్బరి, ఆలీవ్ నూనె, ఆముదాలను సమపాళ్లలో తీసుకుని బాగా కలపాలి. తలస్నానం చేయడానికి ఒక గంటకు ముందు పై మిశ్రమనూనెను తలకు బాగా పట్టించాలి. ఆ తరువాత కండీషనర్ ఉన్న షాంపూతో శుభ్రంగా తలస్నానం చేయాలి.
 
అలాగే.. వారనికోసారి కలబందరసం (అలొవీరా) లేదా పెరుగును తలకు పెట్టుకోవడం వల్ల కూడా కురులకు ఎంతగానో మేలు చేస్తాయి. ఇవి జుట్టుకు మంచి కండీషనర్లుగా పనిచేస్తాయి కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవు.