గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By Eswar
Last Updated : మంగళవారం, 8 జులై 2014 (20:06 IST)

నాడు మావోయిస్ట్ నేడు జెడ్.పి చైర్మన్... తుల ఉమ స్టోరీ....

యాదవ కులంలో గొర్రెల కాపరి కూతురుగా పుట్టిన ఆమె మొదట్లో బీడీ కార్మికుల సమస్యలపై పోరాటాలను చేసింది. ఆ తర్వాత ప్రజాసమస్యలపై పోరాట క్రమంలో మావోయిస్ట్ ఉద్యమంలో పనిచేసింది. ఆ తర్వాత క్రమంలో వనాన్ని వీడి జనంలోకి వచ్చిన ఆమె  ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలను కొనసాగించి చివరకు జడ్పీ చైర్ పర్సన్ అయ్యింది. మావోయిస్ట్ నుండి కరీంనగర్ జిల్లా తొలి మహిళా జడ్పీ చైర్ పర్సన్ వరకు సాగిన తుల ఉమ ప్రస్థానాన్ని ఓ సారి చూద్దాం.
 
పోరాటాల ఖిల్లా కరీంనగర్. అన్యాయాలపై తిరుగుబాటు బావుటా జిల్లా ప్రజల నైజం. నాటి తెలంగాణ సాయుధ పోరాటం నిన్నటి నక్సల్స్ ఉధ్యమం, ఈరోజటి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఇలా ప్రతి ఉద్యమంలో కీలక భూమికను జిల్లా పోషిస్తూ వచ్చింది. తనకు నిండా 15 ఏళ్లు లేని నాడే విప్లవోద్యమంలో తెగువను చూపింది. ప్రస్తుత కరీంనగర్ జిల్లా జడ్పి చైర్ పర్సన్ తుల ఉమ... దోపిడీ వ్యవస్థ పై తన బాల్యంలోనే తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. ఆ క్రమంలో నక్సలైట్ ఉద్యమంలో చేరినా, ఆ తర్వాత జనంలో కలిసినా తన పోరాటా పంథాను వీడలేదు ఆమె. ఆద్యంతం పోరాటాలు సాగించిన తుల ఉమ చివరకు కరీంనగర్ జిల్లా పరిషత్‌కు తొలి మహిళా చైర్ పర్సన్‌గా ఎన్నికయ్యారు.
 
జిల్లాలోని మేడిపల్లి మండలం మోత్కురావు పేటలో ఓ గొర్రెల కాపరి కుటుంబంలో జన్మించింది తుల ఉమ. ముగ్గురు ఆడబిడ్డలలో చిన్నదైన ఉమ చిన్ననాటి నుండి పెత్తందారి వ్యవస్థను ప్రశ్నిస్తూ సామాన్యుల పక్షాన పోరాటాలు చేసింది. అదేసమయంలో నక్సలిజం వైపు ఆకర్షితు రాలై అన్నలతో కలిసి అడవిబాట పట్టింది. 1984 నుండి 1994 వరకు పదేళ్ల పాటు అజ్ఞాతంలో గడిపిన ఉమ నక్సల్స్ ఉద్యమం పీపుల్స్ వార్, జనశక్తిగా విడిపోయిన సందర్బంలో జనశక్తి వైపు నడిచింది. 1991 -94 మధ్య జిల్లా కమిటి సభ్యురాలిగా పనిచేసింది. అజ్ఞాతంలో ఉన్న సమయంలోనే సిరిసిల్ల డివిజన్‌లో కీలక పాత్ర పోషించింది. అదేసమయంలో ఉద్యమ నాయకుడు తుల రాజేందర్‌తో ఆమెకు వివాహం జరిగింది.
 
1994లో అనారోగ్య కారణాలతో భార్యాభర్తలిద్దరు లొంగిపోయి జనంలో కలిసారు. చిన్నప్పుడు చదువుకోలేక పోయిన ఆమె లొంగిపోయిన అనంతరం ప్రైవేట్‌గా బిఎ డిగ్రీని పూర్తి చేసారు. 1994లో జగిత్యాల నియోజకవర్గం నుండి సిపిఐ(ఎంఎల్) పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యింది ఉమ. ఆ తర్వాత బీడీ కార్మికుల పక్షాన పోరాటాలను కొనసాగించింది. అజ్ఞాతంలో ఉన్న సమయంలో ఎలాంటి కేసులు లేని ఉమ ఆతర్వాత బీడీ కార్మికుల పక్షాన పోరాటాన్ని భూజాలకు ఎత్తుకున్న సమయంలో అనేక కేసులు ఎదుర్కొనాల్సి వచ్చింది.  
 
2001లో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఆ పార్టీలో చేరిన ఆమె ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రను పోషించారు. మొదట్లో పార్టీ మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా పనిచేసిన ఉమ, 2010 నుండి పార్టీ మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు..  కరీంనగర్ జడ్పీ పీఠం బిసిలకు రిజర్వ్ అవ్వడంతో కథలాపూర్ స్థానం నుండి జడ్పిటిసిగా ఎన్నికై చివరకు జడ్పీ చైర్‌పర్సన్ పీఠాన్ని అధిరోహించారు. గతంలో ప్రజా ఉద్యమాల్లో ఉన్న అనుభవంతో ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయం తాను ముందుకు సాగుతానని, ప్రజల వద్దకు పాలనను తీసుకువెళ్తానని ఉమ అంటున్నారు.