దక్షిణాది హీరోయిన్లలో అగ్రహీరోయిన్‌గా ముద్రవేసుకున్న పొడవుకాళ్ల సుందరి "త్రిష".
దక్షిణాది చిత్రాల్లోనే గాకుండా ఉత్తరాదిలో అడుగు పెట్టిన త్రిష తాజాగా బాలీవుడ్ అవకాశం కొట్టేసింది.
వర్షం, యువ, సైనికుడు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, నువొస్తానంటే.. నేనొద్దంటానా, అతడు, స్టాలిన్, కృష్ణ, పౌర్ణమి, కింగ్ వంటి చిత్రాల ద్వారా త్రిష టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌తో మళ్లీ "నమో వెంకటేశ" అనే చిత్రంలో నటిస్తోంది. మరోవైపు "వర్షం"లో విలన్‌గా నటించిన గోపిచంద్ సరసన "శంఖం" చిత్రంలోనూ హీరోయిన్ పాత్రను పోషిస్తోంది.
సినీ రంగంలో రాణించేందుకు అమ్మే తనకు స్ఫూర్తి అని చెబుతోన్న త్రిష, బాలీవుడ్‌లో ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తోన్న "ఖాటా మీటా"లో అక్షయ్ కుమార్‌తో జతకట్టనుంది. రొమాంటిక్ కామెడీతో తెరకెక్కనున్న ఈ సినిమా ద్వారా త్రిషకు అదృష్టం కలిసొస్తుందని సినీ పండితులు అంటున్నారు.
సహనటిగా కోలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన త్రిష తొలుత ప్లాప్‌లనే చవిచూసింది. తర్వాత విలక్షణ నటుడు విక్రమ్ సరసన నటించిన తమిళ "సామి" సినిమా త్రిష సినీ కెరీర్‌ను మలుపు తిప్పింది. మహేష్ బాబు నటించిన "ఒక్కడు" సినిమా తమిళ రీమేక్ "గిల్లి" కూడా త్రిషకు మంచి పేరు సంపాదించిపెట్టింది.
ఇలా కోలీవుడ్‌లో పలు చిత్రాల్లో కీలక పాత్రలను పోషించిన త్రిష, తెలుగులో కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకత్వం వహించిన "నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా" చిత్రానికి ఫిల్మ్ ఫేర్, నంది అవార్డులను సొంతం చేసుకుంది.
టాలీవుడ్‌లోనూ తన హవాను కొనసాగించిన త్రిషకు బుజ్జిగాడు, భీమా వంటి చిత్రాలు అంతగా పేరు సంపాదించి పెట్టలేకపోయినా, ఇటీవల విడుదలైన రాధామోహన్ చిత్రం "అభియుం నానుమ్" (తెలుగులో ఆకాశమంత) ఆమెకు మంచి గుర్తింపును సంపాదించి పెట్టింది.
ఇదిలా ఉంటే.. కృష్ణన్, ఉమాకృష్ణన్ దంపతులకు పాలక్కాడులో పుట్టిన త్రిష, తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందింది. చెన్నైలో ఉన్నత విద్యను పూర్తి చేసిన త్రిష, మోడలింగ్ రంగంలోకి ప్రవేశించి 1999లో "మిస్ సేలం"గా నిలిచింది, అదే సంవత్సరంలో "మిస్ చెన్నై"గా కిరీటం దక్కించుకుంది. "2001 మిస్ ఇండియా మిస్ బ్యూటీఫుల్ స్మైల్"గానూ తన హవాను కొనసాగించింది.