ఆకతాయి చెంప ఛెళ్లుమనిపించిన శ్రియ
Publish: Tue, 8 Apr 2008 (12:49 IST)
Updated: Tue, 8 Apr 2008 (12:48 IST)
సాధారణంగా అల్లరి చేసే ఆకతాయిల చెంపలు ఛెళ్లుమనిపించడం సినిమాల్లో మనం చూస్తుంటాం. చివరకు హీరో అయినా సరే హీరోయిన్ వెనుకాముందు ఆలోచించకుండా లాగి ఒకటిస్తుంది. ఈ సంఘటన పదిమందిలో జరిగితే.. ఆ ఆకతాయికి జీవితాంతం గుర్తుండి పోతుంది. ఇలాంటి సంఘటన పవిత్ర పుణ్యస్థలం తిరుమలలో సోమవారం చోటు చేసుకుంది. సర్వధారి నామ సంవత్సరం సందర్భంగా శ్రీవారిని దర్శించుకునేందుకు సినీనటి శ్రియ తన కుటుంబ సభ్యులతో కలసి తిరుమలకు వెళ్లింది. శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న తర్వాత ఆమె ఆలయం వెలుపల మీడియాతో కొద్ది సేపు మాట్లాడింది. ఆ సమయంలో ఒక ఆకతాయి ఆమె వద్దకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. అంతే...ఇక వెనుకాముందు ఆలోచించకుండా ఆకతాయి చెంప ఛెళ్లుమనిపించింది "శివాజీ" భామ. ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు ఆ వ్యక్తికి బాగా దేహశుద్ధి చేశారు. ఈ సంఘటనతో కొద్దిసేపు శ్రియ కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.