యానిమేషన్ చిత్రాలకు మంచి భవిష్యత్: సత్య
|
ఆయన అలా రూపొందించిన చిత్రమే 2006 ఉత్తమ యానిమేషన్ చిత్రంగా జాతీయ అవార్డుకు ఎంపిక కావడం విశేషం. యానిమేషన్ పరిశ్రమపై కలిగిన ఆసక్తితో సత్యనారాయణ టోనీయార్క్‌లో పనిచేయడం ప్రారంభించారు. దాదాపు ఆరు యానిమేషన్ చిత్రాలు జాతీయ అవార్డు కోసం పోటీలోకి రాగా తన చిత్రం కిట్టు-2డి యానిమేషన్ చిత్రం అవార్డుకు ఎంపిక కావడం ఆనందానిస్తోందని ఆయన పేర్కొంటున్నారు.
జాతీయ అవార్డు వచ్చిన సందర్భంగా సత్యనారాయణ తన భావాలను మనతో పంచుకున్నారు. అలా ఆయన చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే...
సహజంగా పౌరాణికాలు యానిమేషన్‌గా రూపొందుతుంటాయి. కానీ పిల్లలు మెచ్చే కథలతో యానిమేషన్ చిత్రం తీయాలనే సంకల్పంతో ఈ కథ ఎంచుకోవడం జరిగింది. ఆ సమయంలో భార్గవ సంస్థతో ఏర్పడిన పరిచయంతో వారే నిర్మాతలుగా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.
పిల్లలకు, జంతువులకు అవినాభావ సంబంధం ఉంది. జంతువులను చూడగానే పిల్లలు కేరింతలు కొడుతారు. అందుకే ఆడుతూ పాడుతూ అడవిలో కాలం గడిపే కోతిపిల్ల పట్టణంలోకి అడుగు పెడితే ఎలా ఉంటుంది అన్న కథాంశంతో ఈ చిత్రం తీయడం జరిగింది. కామిక్ తరహాలో ఈ చిత్ర కథను ముందుకు తీసుకుపోవడమే బహుశా జ్యూరీ సభ్యులను ప్రభావితం చేసి ఉండవచ్చు.
భవిష్యత్‌లో యానిమేషన్ చిత్రాలకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది. థియేటర్లలో ఈ చిత్రాలు ప్రదర్శించకపోయినా శాటిలైట్, వీసీడీ, డీవీడీ రైట్స్ వల్ల నిర్మాతలకు లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. అలాగే వీటిని ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేసే సౌకర్యం కూడా ఉంటుంది. కిట్టునూ రాంచో పేరుతో హిందీలోకి డబ్బింగ్ కూడా చేశారు.
ఈ సందర్భంగా కిట్టు చిత్రం నిర్మాత భార్గవ సైతం తన భావాలను పంచుకున్నారు.
దాదాపు 17 ఏళ్ల తర్వాత తెలుగు చిత్రానికి జాతీయ అవార్డు దక్కడం అదీ తమ యానిమేషన్ చిత్రమైన కిట్టుకు రావడం సంతోషాన్ని కలిగిస్తోందని భార్గవ అన్నారు. ఈ అవార్డు యానిమేషన్ ఇండస్ట్రీకి దక్కిన అవార్డుగా ఆయన అభివర్ణించారు.
ఈ ఏడాది జాతీయ అవార్డుల్లో యానిమేషన్ విభాగం ప్రవేశపెట్టడం తొలిసారి తమ చిత్రానికి అవార్డు రావడం గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు. ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా తమకు నంది అవార్డు లభించిందని ఆయన గుర్తు చేశారు. యానిమేషన్ ప్రారంభానికి ఇది శుభసూచకమని ఆయన అన్నారు.