అలీ నటించిన "సోంబేరి" చిత్రం దర్శకుడిగా తనకు గుర్తింపు నిచ్చిందని జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు చెప్పారు. యర్రమిల్లి వెంకట్రావ్ నిర్మించిన ఈ చిత్రం విడుదలై మూడో వారానికి చేరుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... అందరూ ఆస్వాదించే విధంగా మంచి కథను తయారు చేసుకుని "సోంబేరి"ని తెరకెక్కించామని అన్నారు.
నిర్మాత ఎంతగానో సహకరించారని, రచయితగా దుబాయ్‌లోని పాట తనకు ఎంతో పేరుతెచ్చిందని ఆయన వెల్లడించారు. నిర్మాత మాట్లాడుతూ... తొలిసారిగా నిర్మాత సారథ్యం వహించిన సోంబేరి తనకెంతో ఆనందాన్నిచ్చిందని, ప్రేక్షకుడిలా థియేటర్లలో చూశామని, వారి స్పందన ఎంతో బాగుందని అన్నారు. నిర్మాణ నిర్వాహకుడు పి,ఎస్. రామచంద్రుడు మాట్లాడుతూ... సంగీతపరంగా మనోకి ఎంతగానో పేరు తెచ్చిందని, సాంకేతిక పరంగానూ మంచి వాల్యూస్ ఉన్న చిత్రమిదని, 21 ప్రింట్లతో రిలీజ్ చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రం ఇప్పటికి కలెక్షన్లు నిలకడగా ఉన్నాయని, పది సెంటర్లలో యాభైరోజులు ఆడుతుందని పంపిణీదారులు చెబుతున్నట్లు రామచంద్రుడు అన్నారు. ఇంతమంచి చిత్రాన్ని రూపొందించడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.
|