అలనాడు శోభన్‌బాబు నటించిన చిత్రం "మల్లెపూవు". ఆ పేరుతో ఎవరో సినిమా నిర్మిస్తున్నారని తెలుసుకున్న నటుడు శోభన్ బాబు దర్శకుడు సముద్రకు ఫోన్‌చేసి వివరాలు తెలుసుకున్నారు. "నా కెరీర్‌లో మంచి సినిమా మల్లెపూవు".. అటువంటి టైటిల్ పెట్టి ఎవరో తీసి ఏదో చేస్తారని కుతూహలంతో మీకు ఫోన్‌చేశాను.
సినిమా ఓపెనింగ్స్ నేను హాజరవుతానని చెప్పారు. కానీ విధివశాత్తూ "మల్లెపూవు" సుగంధాన్ని మిగిల్చి ఆయన వెళ్ళిపోయారు. అంటూ చిత్ర దర్శకుడు శోభన్ బాబు తనతో మాట్లాడిన క్షణాలను ఒక్కసారి గుర్తు చేసుకున్నారు. అందుకే తానే దర్శకత్వం వహించి, ఈ చిత్రాన్ని ఆయనకు అంకిత మిస్తున్నట్లు సముద్ర ప్రకటించారు.
ఆదివారం ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్లో జరిగిన ప్రెస్‌మీట్‌లో సముద్ర మాట్లాడుతూ...ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయిందని, ఇందులో ఏడు పాటలున్నయని చెప్పారు. ముందు ఈ చిత్రకథను స్నేహితుడు రమేష్ వర్మ తయారు చేసుకున్నారని, అది విని నచ్చాకే తాను తీయాలనుకున్నట్లు తెలిపారు.
ఇటువంటి చిత్రాన్నితీయాలంటే న్యాయం చేయగల నిర్మాత కావాలనుకుంటున్నప్పుడే మోహన్‌గారు లభించారని చెప్పారు. కథారీత్యా హీరోగా కొత్తవాడైన మురళీకృష్ణను ఎంపిక చేశామని, ఇక నటిగా భూమికను ఎంపిక చేశామని అన్నారు. భూమిక కథ విని... హిందీ హక్కులు తానే తీసుకుంటానని చెప్పిందని, మరోవైపు అనుభవజ్ఞుడైన సంగీత దర్శకుడిగా ఇళయరాజాను ఎంపిక చేశామని చెప్పారు. ఈ చిత్ర కథను విన్నవెంటనే తమిళ హక్కులు తనకే కావాలని అడిగినట్లు సముద్ర వెల్లడించారు.
మరో ప్రత్యేకత ఏమంటే.. అపూర్వ సహోదరులు తర్వాత ఇళయరాజా ఈ చిత్రంలో ఓ పాట పాడడం విశేషం... భూమిక తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పడం... ఇన్ని విశేషాలున్న ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని సముద్ర ఆశాభావం వ్యక్తం చేశారు.
నిర్మాత మోహన్ మాట్లాడుతూ... కథ నచ్చి నిర్మాణ సారథ్యం చేపట్టానని, ఈ నెల 18, 22 తేదీల్లో ఆడియోను ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేస్తున్నామని తెలిపారు. వచ్చేనెల లేదా సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేస్తున్నామని వెల్లడించారు. ఇక ఈ చిత్రానికి కెమెరా... అనిల్ భండాలి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. వి. సముద్ర.
|