1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

చిరంజీవిది వలసవాదుల పార్టీ! : యనమల

చిరంజీవిది వలసవాదుల పార్టీ యనమల
WD PhotoWD
చిరంజీవి ఏర్పాటు చేయబోయే పార్టీ క్రమంగా వలసవాదులతో నిండుతోందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు వెల్లడించారు. కొంత కాలం క్రితం ఆయన సన్నిహితులు రాజకీయ ప్రక్షాళన చేస్తామన్నారని, అయితే ప్రక్షాళన అంటే వలసలను ప్రోత్సహించడమా అని యనమల ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రజల్లో ఒక ఉప్పెన వస్తుందని చెప్పిన చిరంజీవి వెంట ఉండే ఆ నలుగురు ఇప్పుడు ఇతర పార్టీల్లోని నాయకులపై దృష్టి పెట్టి లంచ్‌లకు, డిన్నర్‌లకు, బ్రేక్‌ఫాస్ట్‌లకు పిలుస్తున్నారని చిరంజీవిని, అరవింద్, నాగబాబు, పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశించి అన్నారు. తాము ఏర్పాటు చేయబోయే పార్టీకి స్పందన లేకపోవడంతోనే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొత్తపార్టీలో పాతనాయకులుగా చిరంజీవి పార్టీ కనిపిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనితో రాజకీయ ప్రక్షాళన చేస్తామన్న చిరందీవి మాటలకు అర్థంలేకుండా పోతుందని చెప్పారు. కొల్లేరు సరస్సుకు ప్రతి ఏడాది పలు రకాల పక్షులు వస్తుంటాయని, అలాంటి వారే ప్రస్తుతం ఆ పార్టీ వెంట నడుస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

వారు చెప్పిన దానికి, ప్రస్తుతం జరుగుతున్న దానికి సంబంధం లేకుండా ఉందని, ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలొచ్చినా ఆహ్వానిస్తామని తెలిపారు. అదేవిధంగా అసాధ్యమైన హామీలిస్తున్నారన్న దేవేందర్‌గౌడ్ మాటలకు అర్థంలేదని రామకృష్ణుడు చెప్పారు. కాంగ్రెస్, తెదేపాలు కలిసే ప్రసక్తే లేదని, ఊహాజనిత ప్రశ్నలకు సమాధానం చెప్పడం సరైంది కాదని అన్నారు.

WD PhotoWD
తెలుగుదేశం పార్టీ ఏర్పడి 26 సంవత్సరాలైందని, ఇప్పటికీ పార్టీ ఎన్నో సమస్యలను ఎదుర్కొందని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో తెదేపా తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు "మీ కోసం" యాత్రకు మంచి స్పందన వస్తోందని, నాయకులు వెళ్లిపోయినంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం లేదని చెప్పారు.

రైతులు రాష్ట్రంలో ఎరువులు, విత్తనాలు లేక రోడ్డున పడుతుంటే సీఏం మాత్రం పుట్టినరోజు వేడుకల్ని జరుపుకోడానికి దేశాలు దాటడం దారుణమన్నారు. విద్యుత్‌ లేక రైతులు, ధరలు పెరిగి పేద మధ్యతరగతి ప్రజలు అల్లాడుతున్నారని, ఆయన విహారయాత్రకు ఇచ్చిన ప్రాముఖ్యత ప్రజల సమస్యలకు ఇవ్వలేదని యనమల ఆవేదన వ్యక్తం చేశారు.

టీడీపీ అధికార ప్రతినిధి రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ జిల్లాలో సోమవారం ఒక్కరోజే పదిచోట్ల రైతులపై లాఠీఛార్జీ చేశారని, విత్తనాలు, ఎరువులు ఇవ్వాలని అడగటమే రైతులు చేసిన పాపమని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ జన్మదిన కానుకగా రైతులకు లాఠీదెబ్బలు రుచిచూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే కనీసం మంత్రులు కూడా స్పందించడం లేదని, ఆనం రాంనారాయణరెడ్డి జోస్యాలు చెబుతూ ప్రాక్టీసు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

తెలంగాణపై వేసిన కోర్‌కమిటీ సమావేశం 13న ఖమ్మంలో జరుగుతుందని ఆయన అన్నారు. విస్తృతస్థాయి సమావేశంలో ప్రస్తుతమున్న సమస్యలు, ఇతర అంశాలు చర్చించడం జరుగుతుందని ఆయన వివరించారు. మంగళవారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో విలేకరులతో యనమల, చంద్రశేఖర్ రెడ్డిలు పైవిధంగా వ్యాఖ్యానించారు.
About Writer
Selvi