2007వ ఏడాదికి 55వ ఫిలింఫేర్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో శనివారం రాత్రి జరిగింది. ఈ అవార్డుల్లో భాగంగా "హ్యాపీడేస్" చిత్రానికి ఐదు కేటగిరీల్లో అవార్డులు దక్కాయి. ఉత్తమ సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్, ఉత్తమ సహాయ నటిగా సోనియా, గేయ రచయితగా వనమాలి, నేపథ్యగాయకుడిగా కార్తీక్‌లను ఈ అవార్డులు వరించాయి.
ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్ (యమదొంగ), నటి త్రిష (ఆడవారి మాటలకు అర్థాలు వేరులే), నూతన నటుడిగా రామ్‌చరణ్ తేజ (చిరుత), సహాయ నటుడిగా జగపతిబాబు (లక్ష్యం)కు దక్కాయి.
అలాగే మలయాళం, కన్నడ చిత్రాలుకూడా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నాయి. ఇకపోతే నటీమణులు పూనం బజ్వా, రంభ, దివ్య, హస్నిక, శోభన, నమిత, శ్రియ, నటులు రాజా, వినీత్ తదితరులు ఆటపాటలతో కార్యక్రమానికి ఊపందించారు.
మరోవైపు తమిళ ఉత్తమ చిత్రంగా "పరుత్తివీరన్", ఉత్తమ నటుడు కార్తీక్ (పరుత్తివీరన్), నటి ప్రియామణి (పరుత్తివీరన్)లు ఎంపికయ్యారు. ఉత్తమ గుణ చిత్ర నటిగా సుజాత (పరుత్తివీరన్), ఛాయాగ్రహకుడిగా కెవి ఆనంద్ (శివాజీ), ఉత్తమ సంగీతం ఎ.ఆర్.రెహమాన్ (శివాజీ), కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిక్ (అళగియ తమిళ్ మగన్), గాయకుడు ఎస్.వి.బాలు సాదనా సర్గం (కిరీటం) అందుకున్నారు. సినిమా రంగంలో విశేష కృషి చేసిన శివకుమార్, జయప్రదకు జీవిత సాఫల్య అవార్డులు ప్రదానం చేశారు.
|