1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"బలాదూర్" పేరుతో రవితేజ కొత్త చిత్రం

WD
రవితేజ, అనుష్క జంటగా నటిస్తోన్న చిత్రానికి "బలాదూర్" (వీడికి బాధ్యతలెక్కువ) అనే టైటిల్ ఖరారైంది. రవితేజ శైలిలో ఎంటర్‌టైన్‌మెంట్, సెంటిమెంట్ అంశాలతో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం కుటుంబకథానేపథ్యంలో సాగుతోందని చిత్ర నిర్మాత డి. సురేష్‌బాబు వెల్లడించారు.

ఈ సినిమా షూటింగ్ పూర్తికావచ్చిన సందర్భంగా బుధవారం రామానాయుడు స్టూడియోలో మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ముందుగా ఈ చిత్రానికి రవితేజకు తగినట్లుగా టైటిల్‌కు పెడతామనుకున్నామని, కానీ కథాపరంగా పెట్టాలని రవితేజ సూచించడంతో "ఇంటికొక్కడు" అనుకున్నా... దానికంటే "బలాదూర్" కరెక్ట్‌గా సరిపోతుందని ఈ పేరును ఖరారు చేసినట్లు తెలిపారు. బలాదూర్‌గా తిరిగే వ్యక్తికి బాధ్యతలు ఏమిటి? అనేది చిత్రంలోని ఆసక్తికర అంశమని, ఇందులో రవితేజ పెద్దనాన్నగా కృష్ణ నటిస్తున్నారని తెలిపారు.

WD
జీవితంలో అన్ని చూసినవాడైనా ఓ సందర్భంలో తనకెదురైన పరిస్థితుల్ని ఎలా ఎదుర్కొన్నాడనే అంశంతో కృష్ణ పాత్ర ఆకట్టుకుంటుందని, క్లైమాక్స్‌లో ఆ పాత్ర డైలాగ్‌లకు ప్రేక్షకుల "క్లాప్" పడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. సంభాషణల రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. రవితేజకు సూటయ్యే టైటిల్ అయినా, అందరికీ సూటయ్యే కథేనని, ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న అన్నదమ్ముల కథ ఇదని, "కలిసుందాంరా" తర్వాత ఉదయశంకర్ మళ్ళీ సురేష్‌ ప్రొడక్షన్స్‌లో చేస్తున్న సినిమా ఇదని, ఆగస్టు 15న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

చాలా కాలం గ్యాప్ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ చేస్తున్న చిత్రమిదనీ, కుటుంబకథా చిత్రాల్లో చక్కని చిత్రమవుతుందనే నమ్మకముందని దర్శకుడు ఉదయ్‌శంకర్ తెలిపారు. ఇంకా ఈ చిత్రంలో చంద్రమోహన్, సునీల్, ఎల్.బి.శ్రీరామ్, ప్రదీప్ రావత్, ఆహుతి ప్రసాద్, శివప్రసాద్, సమీర్, రాజా రవీంద్ర, సుమన్ శెట్టి, మల్లిఖార్జున రావు, రవి ప్రకాష్, సుమిత్ర, భార్గవి, గుండు హనుమంతరావు, కాదంబరి, కిరణ్, తిరుపతి ప్రకాష్ తదితరులు నటిస్తున్నారు.

డా. రామానాయుడు సమర్పిస్తున్న ఈ చిత్రానికి మాటలు.. లక్ష్మీ భూపాల్, రచన.. పరుచూరి బ్రదర్స్, సంగీతం.. రాధాకృష్ణ, కెమెరా.. బి. బాలమురుగన్, కథ, దర్శకత్వం.. ఉదయ్‌శంకర్.
About Writer
Selvi