వారంతా టీనేజ్ వయస్సువాళ్ళే. ఇంటర్‌మీడియేట్ చదువుతున్నవారందరిదీ ఓ లోకం. ఆ లోకంలో వారి ఆలోచనలు, ప్రవర్తన, స్నేహం, చదువు, కేరింతలు ఎలా ఉంటాయో తెలియజెప్పే కథాంశంతో "కొత్త బంగారులోకం" చిత్రం రూపొందుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి "ఆర్య" నుంచి ఆయన చిత్రాలకే పనిచేసిన శ్రీకాంత్ అడ్డాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
షూటింగ్ మొత్తం మియాపూర్‌లోని విజ్ఞాన్ కళాశాల, బాష్యం స్కూల్లోనే జరుపుకుని 90శాతం పూర్తి చేసుకుంది. "హ్యాపీడేస్" ఫేమ్ వరుణ్ సందేశ్ కథానాయకుడిగా పరిచయమవుతుండగా, ముంబైకి చెందిన బాలనటి శ్వేతబాసు ప్రసాద్ హీరోయిన్‌గా నటిస్తోంది. వీరితో పాటు కాలేజీలో చదివే 30మంది నటీనటులుగా పరిచయమవుతున్నాపు. వీరందరిపై సోమవారం విజ్ఞాన్ ఆవరణలో ఓ పాటను చిత్రీకరించారు.
మిక్కీజె. మేయర్ "హ్యాపీడేస్", "హరేరామ్" చిత్రాల తర్వాత చేస్తున్న ఈ చిత్రంతో హ్యాట్రిక్ సాధిస్తాడనే అభిప్రాయాన్ని దిల్‌రాజు వ్యక్తం చేశారు. 2004లో దర్శకుడు చెప్పిన కథలోని కొన్ని సన్నివేశాలు చెప్పారని, అవి 2007కు ఓ కొలిక్కి వచ్చి 2008కు నిర్మాణ దిశగా సాగిందని అన్నారు. తమ బేనర్‌లో కథాబలమున్న చిత్రాలే నిర్మిస్తున్నామని, అందుకే "కొత్త బంగారు లోకం" మరో సక్సెస్ అని నమ్మకంగా చెప్పగలనని అన్నారు.
ఆగస్టు మొదటి వారంలో ఆడియోను, చివరి వారంలో సినిమాను విడుదల చేయనున్నట్లు దిల్‌రాజు వెల్లడించారు. ఈ సినిమాలో ఆరు ఆహ్లాదకరమైన ట్యూన్స్ ఉన్నాయని, మంచి కథాబలమున్న చిత్రంలో చేయడం ఆనందంగా ఉందని మిక్కీజే మేయర్ తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ.. కథ ఎంత గొప్పగా ఉన్నా టైటిల్ అనేది ప్రాణమని, నాగార్జున కొడుకు చిత్రానికి దర్శకత్వం వహించనున్న వాసూవర్మ అనుకున్న కథకు ఈ టైటిల్ పెట్టుకున్నారని, తమ కథకు ఇది కరెక్ట్ అని భావించి అడిగితే.. వెంటనే ఆయన టైటిల్ ఇచ్చారని వివరించారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని, చెప్పారు.
సోమవారం (జూలై 21) తన పుట్టినరోజని, ఈ బేనర్‌లో నటించడం చాలా సంతోషంగా ఉందని వరుణ్ సందేశ్ వ్యాఖ్యానించారు. ఇంకా బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, రజిత, వినయ ప్రసాద్, రావురమేష్, సుష్మ, ప్రవీణ్, చిన్నికృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి, కెమెరా... ఛోటా కె. నాయుడు, నిర్వహణ.. మధుసూదన్ రెడ్డి, సహనిర్మాతలు... శిరీష్, లక్ష్మణ్, పాటలు... సీతారామశాస్త్రి, అనంత్ శ్రీరామ్, శ్రీకాంత్ అడ్డాల, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. శ్రీకాంత్ అడ్డాల.
|