అక్కినేని నాగార్జున తన 49వ పుట్టిన రోజును శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని తన స్వగృహంలో అభిమానుల సమక్షంలో జరుపుకున్నారు. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వర రావు నివాసంలోనూ, అన్నపూర్ణ స్టూడియోల్లోనూ తన పుట్టిన రోజు వేడుకలను వైభవంగా జరుపుకున్నారు.
నాగార్జున స్వగృహంలో జరిగిన నాగ్ పుట్టినరోజు వేడుకల్లో అక్కినేని, నాగార్జున యువత అధ్యక్షుడు ఎ.వి. రామారాజు, అమల, నాగసుశీల, సుశాంత్ పాల్గొన్నారు. కె. రాఘవేంద్ర రావు, వి. ఎన్. ఆదిత్య, ఆర్. బి. చౌదరి నాగార్జునకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అభిమానుల తరపున లక్షరూపాయల చెక్కును డాక్టర్ అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలకు నాగ్ రామరాజుకు అందించారు. ఆ తర్వాత సీనియర్ జర్నలిస్టు నందగోపాల్‌కు స్వర్ణకంకణం బహూకరించారు. అదేవిధంగా వికలాంగుల సహాయార్థం 20వేలను అందించారు.
నాగార్జున మాట్లాడుతూ.. పుట్టినరోజు జరుపుకోవడం ఇష్టం లేదు. ఒకప్పుడు బాగుండేది. వయస్సు పెరిగే కొద్దీ బాధగా ఉంది. ఈ పుట్టినరోజు ప్రత్యేకత ఏమిటంటే...? తన పెద్దబ్బాయి నాగచైతన్య హీరోగా పరిచయం కావడమని అన్నారు. వేసవిలో చైతన్య చిత్రం విడుదలవుతుందని తెలిపారు. తనను ఆదరించినట్లే చైతన్యను ఆదరించి, ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఫ్యాన్స్ అభిమానాన్ని ఏనాటికీ మరిచిపోలేనని, మీ తనకు, తన కుమారుడు (నాగార్జున)కు ఇచ్చినట్లే చైతన్యకు కూడా అభిమానులు ప్రేమను అందించాలని ఆకాంక్షించారు. పుట్టినరోజంటూ అనవసరపు ఖర్చులకు వెచ్చించే నగదును సామాజిక కార్యక్రమాలకు వినియోగించండని అభిమానులకు అక్కినేని సూచించారు.
|