ఉగాదికి "రామానాయుడు ఫిలిం స్కూల్"
|
ఈ సందర్భంగా సురేష్ బాబు కోర్సు వివరాలను తెలియజేస్తూ... దర్శకత్వం, స్క్రీన్‌ప్లే కేటగిరిలో 25సీట్లు, సినిమాటోగ్రఫీలో 25 సీట్లు ఉంటాయనీ, 18 నెలల కోర్సుకు రెండులక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వివరించారు. కనీస విద్యార్హత డిగ్రీ ఉండాలని, డిగ్రీ లేకపోయినా వాటిపై తగిన ప్రతిభ ఉంటే ప్రోత్సహిస్తామన్నారు. ప్రతిభ ఉండి పేదవారైన వారికి ఉచితంగా నేర్పించే సదుపాయాన్ని కూడా కలుగజేస్తామన్నారు. ఇప్పటికే అభ్యర్థులు చాలా మంది దరఖాస్తు చేశారని, ఈ నెల 17, 18, 19, 20 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. ఉగాది నాటికి తరగతులు ప్రారంభిస్తామన్నారు.
పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... హైదరాబాద్‌లోని పలుచోట్ల రకరకాల శిక్షణా సంస్థలున్నా, ప్రాక్టికల్‌గా ఏవీ ఉపయోగపడడం లేదని, అవన్నీ ఈ స్కూల్లో బోధించడం జరుగుతుందని చెప్పారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ఐదేళ్లుగా ఇటువంటి స్కూల్‌కోసం డి. సురేష్ బాబు కృషి చేస్తున్నారని, ఇప్పటికీ కార్యరూపం దాల్చిందన్నారు. నిజం చెప్పాలంటే సరైన క్వాలిటీ గల తెలుగు సినిమాలు రావడం లేదు. సరైన అవగాహన లేకపోవడంతో... ఎలా పడితే అలా సినిమాలు తీస్తున్నారు. ఇటువంటి స్కూల్స్ వల్ల ప్రతిభ గలవారు ముందుకు వస్తారని, దానిద్వారా క్వాలిటీ మెరుగవుతుందని తమ్మారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.