1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

వీధి బాలల నేపథ్యమే కేక: తేజ

వినోదం వెండితెర కథనాలు కేక చిత్రం ఆడియో విడుదల దామోదర్ రెడ్డి తమ్మారెడ్డి భరద్వాజ సురేష్ బాబు చంద్రబోస్
WD
"కేక" చిత్రం విడుదలకాకముందే ఒక్కోపాటను ఒక్కో ఎఫ్.ఎం. ద్వారా విడుదల చేసి సరికొత్త పంథాలో వెళతాననీ, ఆ తర్వాతే సినిమా ఆడియో విడుదల చేస్తానని ప్రకటించిన తేజ కాస్త వెనక్కు తగ్గారు. సినిమా ముందు ఆడియో విడుదల రొటీన్ అని చెప్పిన ఆయనే అదే మార్గంలో పయనించారు. ఇందుకు నిదర్శనమే గురువారం రాత్రి హైదరాబాద్‌ తాజ్‌డెక్కన్‌లో "కేక" ఆడియో మహోత్సవాన్ని జరిపారు. ఆదిత్య ద్వారా ఆడియో విడుదలైంది.

ఈ కార్యక్రమానికి రాష్ట్రమంత్రి దామోదర్ రెడ్డి, సంగీత దర్శకుడు చక్రి, తమ్మారెడ్డి భరద్వాజ, డి. సురేష్ బాబు, చంద్రబోస్, దిల్ రాజు, నల్లమలుపు బుజ్జి తదితరులు హాజరయ్యారు. ముఖ్య అతిథి దామోదర్ రెడ్డి ఆడియో క్యాసెట్‌ను విడుదల చేసి, డి. సురేష్ బాబుకు అందించారు. ఆడియో సీడీని తేజ ఆవిష్కరించి దిల్‌రాజుకు అందజేశారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు తేజ మాట్లాడుతూ... చిత్రం మూవీస్ బేనర్‌లో సినిమా చేసి ఐదేళ్లయిందన్నారు. ఈ రకంగా అందరినీ కలిసినందుకు ఆనందంగా ఉందని, మొట్టమొదటిసారిగా సంగీతదర్శకుడు చక్రితో కలిసి పనిచేశానని వెల్లడించారు. ఇందులో ఆరు పాటలున్నాయని, తన వరకు చాలా సంతృప్తికరమైన ట్యూన్స్ ఇచ్చారని, ఇంతకుముందు చిత్రాల్లో ఒకటో, రెండో పాటలు బాగుండేవి కావని, కానీ "కేక"లో అన్ని పాటలు బాగున్నాయని చెప్పారు.

తన ఒత్తిడి భరించి చాలా ఓపిగ్గా చక్రి ట్యూన్స్ ఇచ్చాడని, చంద్రబోస్ వంటి బిజీ మనిషి చక్రి ద్వారా తమతో కలిశారని వివరించారు. సురేష్ బాబు తనకు కలిసి వచ్చిందని పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు ఆయన స్టూడియోలోనే జరిగాయని చెప్పారు.

తమ్మారెడ్డి గురించి చెప్పాలంటే... నువ్వు-నేను ఆడియో విడుదల చేశారని అది గొప్ప సక్సెస్ అయిందని, వీళ్లంతా తన శ్రేయోభిలాషులని చెప్పారు. అందుకే వారినందరినీ పిలిపించి ఆనందిస్తున్నట్లు తేజ వెల్లడించారు. ఇకపోతే తన ప్రవర్తన తిక్కగా ఉంటుందని, కేతిరెడ్డి జగదీష్ రెడ్డి తనకు బ్యాక్‌బోన్ అని, తన వెన్నంటి ఉంటూ తాను చేసే పిచ్చిపనులను సరిదిద్దుతుంటాడని తెలిపారు. పబ్లిసిటీ వారిని కూడా హింసపెట్టానని, అయితే దానికి తగ్గట్టు ఔట్‌పుట్ వచ్చిందన్నారు.

ఇందులో 40 మంది పిల్లలున్నారని, అందులో నలుగురు హైదరాబాదీయులు, మిగిలిన వారు బెంగాలీయులని అన్నారు. "కేక" వీధిబాలల స్టోరీ అని, వారి జీవనపోరాటం, ఆకలి, ప్రేమ, చీటింగ్, ఫైట్స్ ఇలా అన్నీ రకాల ఎమోషన్స్ కలిసిన కథ ఇదని, తెలుగు సినిమాలోనే కొత్త ఫార్మెట్‌లో ఈ చిత్రాన్ని తీశానని తేజ చెప్పారు.

మంత్రి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ... 1990లోనూ మంత్రిగా ఉన్నప్పుడు తనను మద్రాసులో సన్మానించారని, దానికి నటి భానుమతి హాజరయ్యారని చెప్పారు. ఆ సమయంలో మీ సినిమాల్లో నటించవచ్చుకదా అని ఆమె అడగడం, రోజూ రాజకీయాల్లో చేస్తుందదే కదా అని భానుమతితో చెప్పినట్లు దామోదర్ రెడ్డి అన్నారు.

సినిమా నటనంటే చాలా కష్టమని భానుమతితో చెప్పిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మూడు నెలలుగా ఎగ్జిబిటర్‌గా తాను ఇబ్బందులను ఎదుర్కొంటున్నానని, సీఎం చిన్న నిర్మాతలకు వెసులుబాటుగా కొన్ని కార్యక్రమాలు చేశారని మంత్రి ఈ సందర్భంగా ఎత్తిచూపారు.

సినిమా తీయడం చాలా కష్టం, సక్సెస్ అయితే కోట్లు పెట్టిన నిర్మాతతో పాటు అందరికీ ఆనందంగా ఉంటుందని, లేదంటే అందరికీ బాధేనని చెప్పుకొచ్చారు. అందుకే సినిమా రంగంలోని సమస్యలను గురించి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు కలిసి సమస్యలను చర్చించుకుంటే బాగుంటుందని సూచించారు.

ప్రస్తుతం ప్రతీ వ్యక్తీ కష్టపడుతున్నాడని, దాంతో పాటు శ్రమతోనూ, ఒత్తిడికి గురవుతున్నాడని, అలాంటి దశలో కాస్త ఊరట నిచ్చేది సంగీతం ఒకటేనని అన్నారు. దానికి మంచి పాటలు తోడయితే ఎంతో ఆనందంగా ఉంటుందని, సంగీతానికి జంతువులు కూడా స్పందిస్తాయని మంత్రి వివరించారు.

"కేక" చిత్రానికి చక్రి చక్కని సంగీతాన్ని అందించారని, నేడు చాలామంది కొత్తవారు గుర్తింపులేక వెలుగులోకి రాలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తేజ అటువంటివారికి గుర్తింపు ఇస్తున్నందుకు అభినందిస్తున్నానని, ఈ చిత్రం విజయవంతం కావాలని దామోదర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

నిర్మాతల మండలి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ... పాటలు చూశానని, చాలా బాగున్నాయని, కెమెరా పనితనం అద్భుతంగా ఉందని, 10,15 సంవత్సరాలుగా రానటువంటి అద్భుతమైన ఫోటోగ్రఫీని పి.సి.శ్రీరాం ఇచ్చారని ప్రశంసించారు.

డి.సురేష్ బాబు మాట్లాడుతూ... తెలుగు సినిమా విలువలు పడిపోతున్న తరుణంలో పి.సి వంటి వారు పనిచేసి వాటి విలువలను పెంచడం అభినందనీయమన్నారు.

గీత రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ... తేజతో చాలా సౌకర్యంగా పనిచేశానని, చక్రి సుమధుర బాణీలు సమకూర్చారంటూ.. తనకు నచ్చిన "ఐ...లవ్...యు" పాటను ఆలపించారు.

చక్రి మాట్లాడుతూ... చిత్ర టీమంతా కసితో పనిచేశారని, సిచ్యువేషన్‌కు తగినట్లుగా పాటలుండటంతో సంగీతం కుదిరిందన్నారు. కొత్తనటీనటులు కాబట్టి ఇమేజ్ ప్రాబ్లమ్ లేదు కనుక తాను ఇచ్చిన ట్యూన్స్ సరిపోయాయని వెల్లడించారు. ఇందులో వేటూరి రెండు పాటలు, శాస్త్రి ఒక పాట రాశారని, హేమచందర్, వేణు, ప్రణవి, కౌసల్, హర్షిక, సుధ, తాను కలిసి పాటలు పాడామని తెలిపారు.
About Writer
Selvi