ప్రపంచ కప్ పోటీల్లో భారత జట్టు తన చేతకానితనంతో పలాయనం చిత్తగిస్తే మనకు అన్నం సహించదు. మన ఆగ్రహానికి అంతుండదు. ఢిల్లీ నాయకులనుంచి గల్లీ నాయకులవరకూ, ఇటు హీరోలనుంచి దర్శక నిర్మాతలతోపాటు చోటా నటీనటులు కూడా స్పందిస్తారు. పార్లమెంట్‌నే పేల్చేయాలని చూసే విదేశీ శక్తుల విషయంలో మటుకు, పోనీ..... వారి పాపాన వారు పోతారని సరిపెట్టుకుంటారే గానీ... దిష్టిబొమ్మలు తగలబెట్టడం, వ్యతిరేకంగా ఒక్కతాటిపై నిలబడడం అనేది జరుగదు.
కానీ కొన్ని విషయాల్లో మటుకు అలా ఉన్న సంఘటనలు లేకపోలేదు. ఇటీవలే కన్నడ, ఆంధ్ర, తమిళనాడు, శ్రీలంక తమిళుల ఘటనల్లో అటు తారాలోకం ఒక్కతాటిపై దిగివచ్చి తమ ఐక్యతను నిరూపించుకుంది. కానీ తాజాగా ముంబై తాజ్‌మహాల్ హోటల్‌ల్లో జరిగిన ఘటనపై సినీవర్గాలు ఒక్కతాటిపై రాలేకపోయాయి. వారిలో భయాందోళనలు కల్గించాయి.
బహిరంగంగా ప్రకటించే ధైర్యంలేకే తలకింద గన్ పెట్టుకుని పడుకున్నా... అంటూ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముంబై టెర్రర్ గురించి తన బ్లాగులో రాసుకున్నాడు. అమీర్ ఖాన్ తో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులకు ముంబై దుస్సంఘటనను ఖండించినప్పటికీ మాఫియా పగడ నీడలో బతుకుతున్న సినీజనం ఈ టెర్రర్ భయానికి వణికిపోతున్నారు. కానీ వారందరికీ వ్యతిరేకంగా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, ఆయన కుమారుడి సహా దాడి జిరిగిన తాజ్ హోటల్‌ను సందర్శించడం విమర్శలకు దారితీసింది.
చివరికి ముఖ్యమంత్రి పదవిపోయే పరిస్థితి కూడా ఏర్పడింది. తామిద్దరమూ కలిసి రాలేదు. అనవసరంగా మీడియా కల్పించిన కథే ఇదని వర్మ ఎన్ని చిలుక పలుకులు పలికినా... దేశ్‌ముఖ్ కుమారుడిని హీరోగా చేయాలనే ప్రయత్నాల్లో వర్మ ఉన్నారు. అప్పటికే నువ్వే కావాలి చిత్రాన్ని రామోజీరావు హిందీలో నిర్మించి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కొడుకును హీరోగా చేశారు. ఇక వర్మ గతాన్ని పరిశీలిస్తే... ఏదోవిధంగా తను వార్తల్లో ఉండాలనే జిజ్ఞాస కనబడుతోంది.
రామ్‌గోపాల్ వర్మ ఎప్పుడూ జయాపజయాలు గురించి పట్టించుకోకుండా వార్తల్లో ఉండాలని అనుకుంటారని ఆయన సన్నిహితులు చెబుతుండేవారు. సహజంగా ఫ్లాప్ సినిమా తీస్తే వెనకడుగు వేస్తారు. కానీ దాన్ని కూడా పెద్ద ప్రచారంగా మార్చుకోవడంలో రామ్‌గోపాల్ వర్మది అందెవేసిన చేయి. అక్కినేని నాగార్జునతో "గోవిందా... గోవిందా..." చిత్రాన్ని నిర్మించినప్పుడు... శ్రీవెంకటేశ్వరస్వామి విగ్రహంపై కాలుపెట్టి కిరీటం తస్కరించే సన్నివేశాన్ని చిత్రించినప్పుడు అది.. పెద్ద గొడవకు దారితీసింది. దాంతో ఆ సన్నివేశాన్ని తొలగించారు.
ఆ దెబ్బతో తెలుగులో తాను సినిమా తీయనని ప్రతిజ్ఞ చేశాడు. తన మాటను తానే నిలబెట్టుకోననీ. ప్రేక్షకులు చూసినా చూడకపోయినా తనకు నచ్చిన విధంగా సినిమా తీయడమే తన పననీ చాలాసార్లు ఇంటర్వ్యూలలో వెల్లడించిన ఘనుడు. "ప్రేమకథ"ను సుమంత్, ఆంత్రమాలితో రూపొందించారు. ఆ తర్వాత హిందీ రంగంవైపు దృష్టిపెట్టారు. ఎక్కువగా హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలు తీసి వారితో తనకు గల చనువును ఎక్కువగా ప్రచారానికి ఉపయోగించుకునేవారు.
ఊర్మిళా, ఆంత్రమాలి, నిషాకొఠారి వంటి వారితో సినిమా తీయడం ఒకటైతే... కథకన్నా వారితో ఎక్స్‌పోజింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. దీనిని పలు సంఘాలు ఖండించినా... ఇదంతా ప్రచారం కోసమే అనేవారు. పైగా బాలీవుడ్‌లో సుప్రసిద్ధ చిత్రం షోలేను రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించడం... దానికి సంబంధించిన హక్కులకోసం సంబంధిత వ్యక్తుల్ని అడగనందున అది గొడవ కావడంతో దాని పేరును "ఆగ్" అని మార్చి తీయాల్సివచ్చింది. అందులో గబ్బర్‌సింగ్ పేరు కూడా ఉండకూడదనడంతో ఆ పేరు కూడా మార్చారు. అదీ అట్టర్ ఫ్లాపే అయింది.