1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

కృష్ణ-విజయనిర్మల కాంబినేషన్‌లో నేరము-శిక్ష

వినోదం వెండితెర కథనాలు కృష్ణ విజయనిర్మల కాంబినేషన్ నేరముశిక్ష విజయ మూవీస్ బేనర్ జయసుధ నరేష్
WD
విజయనిర్మల నిర్మాణ సంస్థ అయిన విజయ మూవీస్ బేనర్‌పై విజయనిర్మల దర్శకురాలిగా కృష్ణ కథానాయకుడిగా "నేరము-శిక్ష" అనే చిత్రం ప్రారంభమైంది. గతంలో ఇదే పేరుతో కృష్ణ సినిమా ఉంది. తాజా చిత్రంలో కృష్ణ, విజయనిర్మల భార్యాభర్తలుగా నటిస్తున్నారు. జయసుధ కీలకపాత్ర పోషిస్తోంది. కృష్ణ కుమారుడిగా నరేష్ నటిస్తున్నాడు. ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోలో బుధవారం ప్రారంభమైంది.

ముందుగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. నేరాలకు సరైన శిక్షపడకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి? అనే అంశాలను ఈ చిత్రంలో చూపించబోతున్నామన్నారు. ఓ స్త్రీ మూలంగా ఏర్పడిన పరిస్థితులే ఈ చిత్ర కథకు ఆధారమని గోపాలకృష్ణ అన్నారు. ఈనాడు, అన్నపర్వతం చిత్రాల్లోని పదునైన సంభాషణల్లా ఈ చిత్రంలో రాస్తున్నామని ఆయన వెల్లడించారు.

విజయనిర్మల మాట్లాడుతూ.. తాను రూపొందించిన "మీనా" కంటే ఇది గొప్ప సినిమా అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 40 రోజుల్లో టాకీ పూర్తి చేసి పాటలు ఫిబ్రవరిలో పూర్తిచేస్తామన్నారు. క్లైమాక్స్‌లో కుక్కపిల్ల ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆమె చెప్పారు.

కృష్ణ మాట్లాడుతూ.. మీనా, పండంటి కాపురం కలిస్తే ఎలా ఉంటుందో ఈ చిత్రం అంతే రేంజ్‌లో ఉంటుందన్నారు.

జయసుధ మాట్లాడుతూ.. పండంటి కాపురంలో తనను విజయనిర్మల పరిచయం చేశారని, ప్రస్తుతం 50 ఏళ్ళకు మళ్ళీ ఆమె చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని చెప్పారు.

ఇంకా ఈ చిత్రంలో కన్నడ నటుడు అకుల్, ధీరజ్, బాలయ్య, శరత్ బాబు, గిరిబాబు, సునీల్, నూతనప్రసాద్, జయప్రకాష్ రెడ్డి, సుత్తివేలు, గుండుహనుమంతరావు, రమాప్రభ, శ్రీలక్ష్మి తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి కథ... బొల్లిముంత నాగేశ్వరరావు, మాటలు.. పరుచూరి బ్రదర్స్, కెమేరా.. కె. శ్రీనివాసరెడ్డి, సంగీతం..కోటి, నిర్మాత, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. విజయనిర్మల.
About Writer
SELVI.M