1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

దక్షిణాది "చార్లీచాప్లిన్" నగేష్ కన్నుమూత

వినోదం వెండితెర కథనాలు హాస్యతార నాగేష్ మృతి చెన్నై బాలచందర్ 1000 చిత్రాలు ఆనంద్ బాబు కోలీవుడ్ టాలీవుడ్
ప్రముఖ హాస్యనటుడు నగేష్ శనివారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్న నగేష్, చెన్నై నగరంలోని ఆయన స్వగృహంలో కన్నుమూసినట్లు ఆయన కుటుంబీకులు వెల్లడించారు. ఆయన వయసు 76 సంవత్సరాలు.

హాస్యతారగా దక్షిణాది చిత్రపరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన నగేష్‌కు ఆనంద్ బాబు అనే కుమారుడున్నారు. ఆనంద్ బాబు మంచి డ్యాన్సర్ మరియు నటుడు కూడా..

కోలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన "నీర్‌కుయిమి" చిత్రం ద్వారా నగేష్ సినీ నటుడిగా అరంగేట్రం చేశారు. మొత్తం 1000కి పైగా చిత్రాల్లో నటించిన ఘనత నగేష్‌దే.

ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించగల నగేష్‌ను దక్షిణాది చార్లీచాప్లిన్ అంటే అతిశయోక్తి కాదేమో. ఎన్టీఆర్, ఏఎన్నార్ తదితర అగ్రశ్రేణి కథానాయకులతో నటించిన నగేష్, కైకాల సత్యనారాయణ హీరోగా "మొరటోడు" చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు.

ఈ చిత్రానికి స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు నిర్మాత. అయితే ఆ చిత్రం అపజయం పాలవడంతో దర్శకత్వానికి స్వస్తి చెప్పి పూర్తి హాస్య నటుడిగా మారిపోయారు. ఆయన నటించిన తెలుగు సినిమా "జై భద్రకాళి" విడుదల కావాల్సి ఉంది.

ఇదిలా ఉండగా.. హాస్యతార నాగేష్ మరణం వార్త విన్న కోలీవుడ్, టాలీవుడ్ సినీరంగాలు దిగ్భ్రాంతిలో మునిగిపోయాయి. ప్రముఖ సినీ తారలు ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
About Writer
SELVI.M