1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

నవ్వుల నగేష్.. అద్భుత నటనకు జోహార్లు..!

వినోదం వెండితెర కథనాలు నవ్వుల నగేష్ తమిళ హాస్యనటుడు మృతి ఎంజీఆర్ శివాజీ గణేశన్ తిరువిలైయాడల్
WD
చలన చిత్రసీమలో తనదైన విశిష్ట బాణీతో నవ్వుల నగేష్‌గా సుపరిచితమైన తమిళ హాస్యనటుడు నగేష్ అస్తమించారు. గతకొంత కాలంగా ఆయన అస్వస్థతతో బాధపడుతున్నారని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. శనివారం తన స్వగృహంలోనే నగేష్ అంతిమశ్వాస విడిచారు.

నగేష్ అసలు పేరు గుండూరావు. 1933లో కన్నడ బ్రాహ్మణ దంపతులకు జన్మించారు. తమిళ సినీ జగత్తును ఎంజీఆర్, శివాజీగణేశన్‌లు ఏలుతున్న 1960 సంవత్సరం నుంచి 1970ల మధ్యకాలం నాటి వరకు నగేష్ లేకుండా ఏ సినిమా విడుదల కాలేదంటే నమ్మలేం..!

సుమారుగా 1000 సినిమాల్లో నటించిన నగేష్ డైలాగులను పలకడంలో కచ్చితమైన టైమింగ్‌కు, ఉచ్ఛారణకు, మాటల విరుపుకు ఆయనే సాటి. దాదాపు ప్రతి సూపర్‌స్టార్ సరసన తన నటనా వైద్యుష్యాన్ని ప్రదర్శించిన ప్రత్యేక గుర్తింపుకు నగేష్ నోచుకున్నాడనే చెప్పాలి.

హాస్యనటునిగా ముద్రపడినప్పటికీ సీరియస్ కథాంశాల సినిమాల్లోనూ నగేష్ నటన అందరి మన్ననలు చూరగొందనడంలో ఎలాంటి సందేహం లేదు. కొన్ని సినిమాల్లో నగేష్ నటించిన పాత్రలు ఎల్లప్పుడు గుర్తుండిపోయేవిగా ఉన్నాయి.

ముఖ్యంగా అలనాటి సూపర్ హిట్ మూవీ "తిరువిలైయాడల్" చిత్రంలో "ధరుమి"గా నగేష్ నటన ప్రశంసనీయంగా నిలిచింది. ఈ చిత్రంలో పూట గడవని కవి పాత్రలో నగేష్ తన బాధలను శివునితోనే చెప్పుకుంటూ.. ఆయనతో తగవుకు సిద్ధపడిన విధానాన్ని అద్భుతమైన రీతిలో నటించి నవ్వించడమే కాకుండా, నటనతో నయనాలను తడిపెట్టించగలనని నిరూపించుకున్నాడు.

WD
అలాగే దర్శకుడు చెల్లప్ప తీసిన చిత్రం "కాదలిక్క నేరమిల్లై"లో నగేష్ పాత్రను తమిళ సినీ జగత్తు ఏనాటికి మరువలేదు. "ఎదుర్నీచల్", "నీర్‌కుయిమి"లలో సీరియస్ పాత్రలను పోషించి నగేష్ జనాన్ని మెప్పించారు.కమల్‌హాసన్ సొంత చిత్రం "అపూర్వ సహోదరగల్" (తెలుగులో "అపూర్వ సహోదరులు", హిందీలో "అప్పురాజు")లో ప్రతినాయకుని పాత్రను మన నవ్వుల నగేష్ పండించారు.

ఆ రోజుల్లోనే తన కాళ్ళపై నిలబడాలని ఇంటి నుంచి బయటికి వచ్చిన నగేష్, మద్రాసులోని మాంబళంలో ఉండేవారు. తొలుత రైల్వేలో చిరుద్యోగిగా జీవితాన్ని ప్రారంభించారు. నాటకాలను మిత్రులతో కలిసి చూసేవారు. "కంబర్ రామాయణం" నాటకాన్ని చూసి, అందులో నటించిన వారికన్నా తాను బాగా చేయగలని అనుకున్నారు. అదే ఉత్సాహమే నగేష్‌ను నాటకరంగ ప్రవేశం చేసింది.

ఇదేవిధంగా.. రైల్వే కల్చరల్ సొసైటీ ఏర్పాటు చేసిన ఓ నాటకంలో కడుపునొప్పితో బాధపడే పాత్రను నగేష్ పోషించారు. ఆ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎం.జి.రామచంద్రన్ నగేష్ నటనా కౌశల్యాన్ని కొనియాడారు. అప్పటినుంచి ఎంజీఆర్‌తో ఉన్న సత్సంబంధాల కారణంగా పలు చిత్రాల్లో నటించి నగేష్ పేరు సంపాదించుకున్నారు.

కానీ కాలక్రమేణా ఎంజీఆర్‌తో పొరపొచ్చాలు రావడంతో నగేష్ కెరీర్ దెబ్బతింది. పాండిబజార్‌లో ఉన్న శ్రీ నగేష్ థియేటర్‌కు కరెంట్ బిల్లుకట్టలేదన్న కారణంగా సీజ్ చేయిస్తే.. ఎం.జి.ఆర్. చొరవతో ఆ సమస్య పరిష్కారమైంది.

ఇలా.. తన అద్భుతమైన నటనతో సినీలోకంలో తన కంటూ ఓ స్థానాన్ని సొంతం చేసుకున్న నగేష్ మృతికి అటు యావత్తు ప్రపంచం, సినీ ప్రముఖులు, ప్రజలు సంతాపం తెలియజేస్తున్నారు. హాస్యతారగా సినీరంగంలో ఓ వెలుగు వెలిగిన నగేష్ ఆత్మ శాంతించాలని అందరూ ఆశిద్దాం..!
About Writer
SELVI.M