Vengamamba Logo released | "వెంగమాంబ" లోగో ఆవిష్కరణ
|
ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు, కీరవాణిలు లోగోను ఆవిష్కరించారు. వి.ఎం.సి. ప్రొడక్షన్ పతాకంపై వి. దొరస్వామిరాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి, పి. ఉదయభాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు.
లోగో ఆవిష్కరణ వేడుకలో పాల్గొన్న దైవజ్ఞ శర్మ మాట్లాడుతూ.. అన్నమయ్యకు ఎంత ప్రాచుర్యం ఉందో స్త్రీ జనోద్ధరణకు నడుంకట్టిన కవయిత్రి వెంగమాంబకు అంతే ప్రాధాన్యత ఉందన్నారు. తరికొండ వెంగమాంబగా పేరు తెచ్చుకున్న ఆమెను దైవజ్ఞ సరస్వతీ దేవీగా కొనియాడారు.
ప్రముఖ దర్శకుడు, గురువు రాఘవేంద్రరావుతో ఈ సినిమాకు దర్శకత్వం వహించే భాగ్యం కలగిందని చిత్ర దర్శకుడు ఉదయభాస్కర్ అన్నారు. ఎస్.వి.ఛానెల్ కోసం మొదటగా వెంగమాంబ సీరియల్‌కు దర్శకత్వ బాధ్యతలు చేపట్టానని, దానికి మంచి పేరు లభించిందని తెలిపారు. ఈ సినిమాను రాఘవేంద్రరావు తీయాల్సిందని, కానీ ఆయన తన పేరును ప్రతిపాదించడంతో తనకు ఈ ఛాన్స్ దక్కిందన్నారు.
అప్పట్లో స్త్రీకి వైధవ్యం శాపం. దాన్ని వ్యతిరేకించి పోరాడిన వనిత వెంగమాంబ అని దర్శకుడు వివరించారు. ఈ సినిమాలోని 22 పాటలకు కీరవాణి బాణీలు సమకూర్చారని ఆయన వెల్లడించారు.
సాయికిరణ్ మాట్లాడుతూ.. కె. రాఘవేంద్రరావు తీసిన "నారదలీలలు"లో కృష్ణునిగా గుర్తింపు లభించింది. ఆ గుర్తింపే ఈ సినిమాలో వేంకటేశ్వరస్వామి పాత్రను పోషించే అవకాశం కల్పించిందన్నారు.
దొరస్వామి నిర్మించిన రెండు చిత్రాల్లో నటించానని మీనా తెలిపారు. ఆయన నిర్మాణంలో ఇది మూడో చిత్రమిదన్నారు. నటిగా తనకు తృప్తినిచ్చిన పాత్ర ఇదని, వెంగమాంబ విజయవంతం కావాలని మీనా ఆకాంక్షించారు.
కీరవాణి మాట్లాడుతూ.. పౌరాణిక చిత్రాలను తెరకెక్కించడంలో రాఘవేంద్రరావుదే పైచేయి. తనదైన శైలిలో ఆయన ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఈ చిత్రానికి వేదవ్యాస్ మంచి సాహిత్యం అందించారని తెలిపారు. జూన్ 7వ తేదీన సినిమా ఆడియో విడుదలవుతుందని కీరవాణి తెలియజేశారు.
నిర్మాత దొరస్వామి మాట్లాడుతూ.. తిరుపతిలోని వెంగమాంబ ఆడిటోరియంలో జూన్ 7వ తేదీన ఆడియో విడుదల కార్యక్రమం జరుగుతుందని జూలై నాలుగో తేదీన సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.