Dharmavarapu Subramaniam| Hero| Comedian| Cinema| Arti Agarwal | ఆర్తి అగర్వాల్‌తో జతకట్టిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం!
WD
నాలుగేళ్ళుగా తన బాడీ లాంగ్వేజ్‌కు సరిపడా కథ ఉందని పలువురు చెబుతూ వచ్చారని, కానీ ఇన్నాళ్లకు అది కార్యరూపం దాల్చిందని నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం అన్నారు.
రాష్ట్ర సాంస్కృతిక శాఖా సలహాదారుగా, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రచార సారథిగా ఉన్న ఆయనను ఆశీర్వదించడానికి రాష్ట్రమంత్రివర్గమే అన్నపూర్ణ స్టూడియోకి దిగివచ్చింది.
అసెంబ్లీ 8.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, వారంతా 7.30కే వచ్చి ధర్మవరపును ఆశీర్వదించారు. హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కె. రోశయ్యతో పాటు పలువురు ధర్మవరపును దీవించారు.
రాఖీపౌర్ణమి సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. రాజా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై ఈ చిత్రాన్ని రాజా ఆర్.ఆర్. నిర్మిస్తుండగా, రామ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ధర్మవరపు, అనుష్యరామ్‌పై తీసిన తొలిషాట్‌కు డా.డి. రామానాయుడు క్లాప్‌కొట్టగా రమేష్‌ప్రసాద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ఈ నెల 18 నుంచి శ్రీశైలంలో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. మూడు షెడ్యూల్లో ఈ చిత్రాన్ని పూర్తిచేస్తామని దర్శకుడు అన్నారు. ధర్మవరపు టీవీరంగంలోనే అందరినీ నవ్వించి వెండితెరకు ప్రవేశించారని, ఈ సినిమా కూడా అదే తరహాలో నవ్వులు కురిపిస్తాయన్నారు.
ధర్మవరపు మాట్లాడుతూ.. జీవితంలో స్థిరపడిన తర్వాత పెండ్లిచేసుకోవాలనుకునే పాత్రను ఈ చిత్రంలో పోషిస్తున్నానని చెప్పారు. అందరిని ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉంటుందని ధర్మవరపు అన్నారు. తమ పతాకంపై పలు చిత్రాలను తీయాలనే ఉద్దేశంతోనే ఫిల్మ్‌ఫ్యాక్టరీ అనే పేరు పెట్టామని నిర్మాత రాజు తెలిపారు.
సంగీత ప్రాధాన్యతతో కూడిన పాటకూడా ఇందులో ఉందని, ధర్మవరపు చేసిన డ్యాన్స్‌లు, ఫైట్లు తెరపై చూస్తేనే కనువిందుగా ఉంటాయని వందేమాతరం శ్రీనివాస్ అన్నారు.
ఆర్తి అగర్వాల్, షెఫాలి శర్మ, అనుష్యరాయ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో రఘుబాబు, ఎం.ఎస్. నారాయణ, కృష్ణభగవాన్, విశ్వేశ్వరరావు తదితరులు నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి కెమెరా: పైడాల శ్రీనివాస్, మాటలు: దీపికా రాజు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్‌కుమార్.