ముంబయి ఉగ్రవాద దాడులతో సంబంధమున్న హెడ్లీతో తన కుమార్తె కంగనా రనౌత్‌కు ఎటువంటి సంబంధం లేదని ఆమె తండ్రి చెప్పారు. పేలుళ్లకు ముందు హెడ్లీ పలువురు బాలీవుడ్ హీరోయిన్లతో కలిసి తిరిగాడని వార్తలు వచ్చిన సంగతి విదితమే.
హెడ్లీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వారిలో ఆర్తీ చాబ్రియాతోపాటు మరో ఐదుగురు తారలు ఉన్నట్లు భోగట్టా. ఆ ఐదుగురిలో కంగనా పేరు కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలో నిజం లేదనీ, తన కుమార్తెకు హెడ్లీ ఎవరో తెలియదని ఆమె తండ్రి అమర్‌దీప్ రనౌత్ వెల్లడించాడు.
ఈ అభూత కల్పనకు కారకులైన వారిపై తాము చర్య తీసుకునేందుకు న్యాయవాదిని సంప్రదిస్తున్నట్లు ఆయన తెలిపారు. "మరి మహేష్ భట్ చిత్రాల్లో కంగనా నటించింది కదా".. అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, "మహేష్ భట్ చిత్రాల్లో నటించిన మాట నిజమే. కానీ ఆయన కుమారుడు రాహుల్ భట్‌తో ఆమెకు ఎలాంటి పరిచయం లేదు. రాహుల్ భట్ పరిచయమే లేకపోతే హెడ్లీతో స్నేహం అనే ప్రశ్నకు తావెక్కడుంది" అని ప్రశ్నిస్తున్నారు.
అమెరికా పౌరుడైన డేవిడ్ హెడ్లీ ముంబయి పేలుళ్లకు పూర్తి స్థాయిలో సహకరించినట్లు ఎఫ్‌బీఐ విచారణలో వెల్లడైంది. మరోవైపు రాహుల్ భట్ సైతం హెడ్లీ తనకు తెలుసు కానీ అతనో తీవ్రవాది అనే సంగతి తనకు తెలియదని చెపుతున్నాడు.