దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'శివాజీ' కాంబినేషన్ మరో సంచలనానికి నాంది పలుకనుంది. తాజాగా శంకర్ దర్శకత్వంలో రూపొందనున్న భారీ బడ్జెట్ చిత్రం 'రోబో'కు రజనీకాంత్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్టు కోడంబాక్కం వర్గాల భోగొట్టా. దాదాపు వంద కోట్ల రూపాయల వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు అయ్యంగరన్ ఇంటర్నేషనల్, ఈరోజ్ మల్టీమీడియా సంస్థలు సోమవారం ముందుకు వచ్చాయి. ఈ రెండు సంస్థల ప్రతినిధులైన కరుణామూర్తి, కిషోర్ లుల్లాలు ఈ విషయంపై సోమవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.
అందులో భారతదేశంలో ఇప్పటి వరకు వెలుగు చూడనటువంటి కథాంశంతో, సాంకేతిక నైపుణ్యం, భారీ బడ్జెట్ చిత్రంగా 'రోబో'ను నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. ఏక కాలంలో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రూపొందే ఈ చిత్రంలో రజనీకాంత్ హీరోగా నటిస్తారని, ఏఆర్ రెహమాన్ సంగీత బాణీలు సమకూర్చుతారని వివరించారు. ఈ చిత్రం మిగిలిన వివరాలను 'శివాజీ' సిల్వర్ జూబ్లీ వేడుకల సమయంలో దర్శకుడు శంకర్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు వారు పేర్కొన్నారు.
ఇదిలావుండగా.. తొలుత ఈ ప్రాజెక్టును బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్‌తో తలపెట్టారు. ఈ చిత్రాన్ని షారూఖ్ తన సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ద్వారా నిర్మించేందుకు సన్నాహాలు చేశారు. అయితే.. కథకు సంబంధించిన పూర్తి స్ర్కిప్టు కావాలని పట్టుపట్టడంతో శంకర్ నిరాకరించారు.
దీంతో శంకర్ - సూపర్‌స్టార్‌తో చర్చలు జరుపగా అందుకు ఆయన సమ్మతించారు. ఇదిలావుండగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ హాటెస్ట్ స్టార్ దీపికా పడుకొనేను హీరోయిన్‌గా ఎంపిక చేసేందుకు శంకర్ నిర్ణయించినట్టు వినికిడి.
|