ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్‌కు కాల్షీట్స్ ఇచ్చికూడా షూటింగ్‌కు సహకరించడం లేదని నిర్మాతల మండలి, ఫిలింఛాంబర్ దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఇటీవలే ఆయనకు మిగిలిన నిర్మాతలు కూడా సహకరించవద్దని ఫిలింఛాంబర్ పేర్కొంది. ఒకవేళ సహకరిస్తే.. ఆపై తీసుకునే వాటికి తమకేమాత్రం సంబంధంలేదని ప్రకటనలో వెల్లడించింది.
అయితే ప్రస్తుతం ప్రకాష్ రాజ్ పలు చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా దిల్‌రాజు చిత్రంలో ప్రకాష్ నటిస్తున్నారు. కానీ ఆ సినిమా తారాగణం జాబితాలో ప్రకాష్ పేరు మాత్రం వేయలేదు. దాదాపు దిల్‌రాజు నిర్మించే నాలుగు చిత్రాలకు గానూ రెమ్యునరేషన్‌ను ప్రకాష్‌రాజ్‌కు ఇచ్చారని విశ్వసనీయ సమాచారం.
మరోవైపు విక్టరీ వెంకటేష్‌తో "చింతకాయల రవి"లోనూ ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. ఆ సినిమాకు నల్లమలుపు బుజ్జి నిర్మాత బాధ్యత వహిస్తుండగా, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు సమర్పిస్తున్నారు. ఇటీవలే ప్రకాష్ రాజ్‌కు నిర్మాతల మండలి వివరణ కోరుతూ నోటీసు పంపింది. దానికి ఆయన తగిన రీతిలో సమాధానమిచ్చారని నిర్మాతల మండలి సభ్యుడొకరు తెలిపారు.
అయితే సోమవారం రాత్రి ప్రకాష్‌రాజ్‌ను తీసుకుని నిర్మాత నల్లమలుపు బుజ్జి ఫిలింఛాంబర్ కార్యాలయానికి వచ్చారు. అక్కడ కమిటీతో తన వివరణ ఇచ్చారు. ఆ వివరాలు ఎలా ఉన్నా... ప్రస్తుతం "చింతకాయల రవి" చిత్రంలో ప్రకాష్ రాజ్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే అగ్రనిర్మాతలు ప్రకాష్‌రాజ్‌ను నటింపజేస్తున్నారు గానీ, చిన్న నిర్మాతలమైన తమ పరిస్థితి ఏమిటని కొంతమంది వాపోతున్నారు.