తెల్లపిల్ల హన్సిక మొత్వానీకి తెలుగులో అనుకున్నంతగా విజయాలు రాకపోవడంతో తన దృష్టిని కోలీవుడ్‌పై పెట్టింది. కోలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఓ రోజు కోడంబాక్కం సెంటర్‌లో షాపింగ్ చేద్దామని తిరుగుతోందట. ఆమె అలా షాపుల చుట్టూ తిరుగుతుండగా ఓ షాపులో ఉన్న పురుషులు హన్సికను అదేపనిగా చూడటం మొదలుపెట్టారట. ఆమె ఎటు వెళుతుంటే అటే ఆమెను గుచ్చి గుచ్చి చూస్తున్నారట.
వారి చూపులను తట్టుకోలేని హన్సిక తన షాపింగ్‌ను మరో షాపుకు మార్చుకున్నదట. అయితే అక్కడ మగాళ్లు కూడా అదేపనిగా చూడటం మొదలుపెట్టారట. అవే గుచ్చే చూపులు. ఏంటీ ఈ మగాళ్లు మహిళలను ఎప్పుడూ చూడలేదా ఏంటీ.. అంటూ తన స్నేహితురాలి వద్ద అన్నదట. అంతే.. హన్సిక స్నేహితురాలు ఓ అడుగు ముందుకేసి.. ఆ మగాళ్ల వద్దకెళ్లి.. ఏంటయా.. ఎందుకలా చూస్తున్నారు. ఏం.. ఇక్కడ బొమ్మలేమైనా ఆడుతున్నాయా...? అంటూ విరుచుక పడిందట.
ఆమె మాటలకు బిత్తరపోయిన ఆ మగాళ్ల గుంపు.. మరేం లేదండీ.. మీ స్నేహితురాలి నవ్వు చూడచక్కగా ఉంది. ఇంకా ఇంకా చూడాలనిపిస్తోంది. ఆమె వెళ్లిపోతే అంతటి అందమైన నవ్వును మళ్లీ మేం ఎప్పటికి చూస్తామో ఏమో.. అంటూ నిట్టూర్చారట. ఆ మాటలు విన్న హన్సిక వారివద్దకు వచ్చి వాళ్లు నవ్వమన్నంత సేపు నవ్వి తృప్తి పరిచిందట.