ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన 'హ్యారీ పోట్టర్'
లండన్ (ఏజెన్సీ), శనివారం, 21 జులై 2007( 11:02 IST )
పుస్తక ప్రియులు, చిన్నారులు, పెద్దలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న 'హ్యారీ పోట్టర్' సిరీస్‌లోని ఏడవభాగం శనివారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. విడుదలైన కొద్ది క్షణాల్లోనే లక్షల కాపీలు అమ్ముడు పోయాయి. ఈ పుస్తకం కోసం రెండు రోజుల నుంచే పుస్తక ప్రియుల భారీ క్యూలల్లో నిలుచుని, పుస్తకాన్ని కొనుగోలు చేశారు.
లండన్‌లో నేచురల్ హిస్టరీ మ్యూజియంలో శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత పుస్తక రచయిత్రి జేకె.రౌలింగ్.. చివరి భాగంలోని తొలి ఛాప్టర్‌ను చదివి పుస్తకాన్ని విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 92 దేశాల్లో ఈ పుస్తకం విడుదల కావడం.. దీనికి ఉన్న డిమాండ్ ఏపాటిదో చెప్పకనే చెప్పవచ్చు.
ఒక్క అమెరికాలోనే 12 మిలియన్ల్ కాపీలు అమ్ముడుపోయాయి. 1997లో తొలిసారిగా విడుదలైన హ్యారీ పోట్టర్ పుస్తకం.. ఇప్పటి వరకు మొత్తం 65 భాషల్లో ముద్రితమైంది. అలాగే.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోను హ్యారీ పోట్టర్ పుస్తకాల విక్రయ సందడి ప్రముఖ దుకాణాల్లో కనిపించింది.