అంతర్జాతీయ చిత్రంలో సెలీనా
ముంబై (ఏజెన్సీ), శుక్రవారం, 9 నవంబర్ 2007( 18:41 IST )
బాలీవుడ్ హీరోయిన సెలీనా జైట్లీ మరో అంతర్జాతీయ చిత్రంలో నటించేందుకు అంగీకరిస్తూ సంతకాలు చేసింది. తద్వారా ఐశ్వర్యరాయ్ బచ్చన్ అడుగుజాడల్లో తాను కూడా నడుస్తున్నానంటూ సెలీనా జైట్లీ చెప్పకనే చెప్పింది. తన రెండవ అంతర్జాతీయ చిత్రంగా 'ది క్వెస్ట్ ఆఫ్ షెహెర్జాదే' చిత్రంలో సెలీనా నటించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నది.
తొలి అంతర్జాతీయ చిత్రంగా 'లవ్ హ్యాస్ నో లాంగ్వేజ్' అనే చిత్రంలో బెన్ మిచ్చేల్ సరసన ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఒక ప్రకటన వెలువడింది. సెలీనా ఇటీవలనే లాస్ ఏంజెలెస్ నుంచి భారత్‌కు తిరిగి వచ్చింది. సాహసాల వీరుడైన యువరాజు షెహెర్జాదే వీరగాథలను వెల్లడించే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన 1001 రాత్రుల కథలు ఇతివృత్తంగా రూపొందించనున్న 'ది క్వెస్ట్ ఆఫ్ షెహెర్జాదే' చిత్రంలో ఆమె నటించనున్నారు.
ఇందుకుగాను హాలీవుడ్ ప్రముఖులు ఓర్లాండో బ్లూమ్, నటాలియా పోర్ట్‌మ్యాన్‌లకు శిక్షణ ఇచ్చిన న్యాన్సీ బ్యాంక్స్ నుంచి సెలీనా శిక్షణ పొందనున్నది.