ఓ గోడ హాలీవుడ్ నటుడు రిచర్డ్ గెరెకు చిక్కులు తెచ్చిపెట్టింది. గోడతో గొడవలేంటంటే ఆయనగారు ఇటీవల ముచ్చటపడి కట్టుకున్న ఓ హోటల్‌కు సంబంధించిన గోడ నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ న్యూయార్క్ ప్రభుత్వ అధికారులు నోటీసులు ఇచ్చేశారు. దీంతో తలపట్టుకోవడం గెరె వంతైంది.
న్యూయార్క్‌లోని బెడ్ ఫోర్డ్‌లో రిచర్డ్ గెరె ఓ హోటల్ నిర్మించాడు. అయితే ఆ హోటల్ కోసం నిర్మించిన పిట్టగోడ ఎత్తు ఐదు అడుగులుందని వెంటనే దాని ఎత్తు తగ్గించాలని న్యూయార్క్ పోలీసులు హుకుం జారీచేశారు. అదేంటంటే అక్కడ నిబంధనల ప్రకారం పిట్టగోడ ఎత్తు నాలుగు అడుగులే ఉండాలట.
పాపం గెరె ఓ అడుగు ఎత్తైన గోడ కోసం ఇంత గొడవ జరిగేసరికి బాగా అఫ్‌సెట్ అయ్యారట. గతంలోనూ ఈయన మనదేశంలో ఇలాంటిదే ఓ సమస్యలో ఇరుక్కున్నారు, గుర్తుందా.
ఎయిడ్స్ ప్రచారం కోసం వచ్చిన ఆయన స్టేజ్‌పై నటి శిల్పాశెట్టిని ముద్దు పెట్టేసుకున్నారు. దీంతో ఆ కార్యక్రమానికి వచ్చినవారంతా పబ్లిగ్గా ఇదేం పనని ఆయన మీద విరుచుకుపడ్డారు. మాకిదంతా మామూలేనని ఆయన ఎంత చెప్పినా ముద్దు దృశ్యం చూచిన వారు మాత్రం తమ కోపాన్ని తగ్గించుకోలేదు. పాపం గెరె.
|