ప్రముఖ పాప్ గాయని బ్రిట్నీ స్పియర్స్ తన తాజా ఉమనైజర్ పాటతో తిరిగి విజయాల బాట పట్టింది. ఇటీవల రూపొందించిన ఉమనైజర్ ఆల్బమ్‌లోని ప్రధాన పాట ఉమనైజర్ అమెరికాలో బిల్‌బోర్డ్స్ హాట్ 100 సింగిల్ చార్ట్‌లో అగ్రస్థానం పొంది రికార్డు సృష్టించింది. గత వారంలో ఈ చార్టులో 96వ స్థానంలో ఉన్న బ్రిట్నీ కొత్త పాట ఉమనైజర్ ఆమెకు పదేళ్ల తర్వాత ఈ చార్టులో అగ్రస్థానం కల్పించింది.
1999లో తన మొట్టమొదటి పాట బేబీ వన్ మోర్ టైమ్ తర్వాత తిరిగి బ్రిట్నీ ఆడి పాడిన పాటకు ప్రధమ స్థానం రావడం ఇదే మొదటిసారి. తొలివారంలో 286,000 మంది ఇంటర్నెట్ వీక్షకులు ఆమె పాటను డౌన్‌లోడ్ చేసుకోవడంతో చార్టులో అధమస్థానం నుంచి ఒక్కసారిగా పుంజుకుని టాప్ ర్యాంక్ సాధించింది.
2003లో డిజిటల్ డౌన్‌లోడ్స్ ట్రాకింగ్‌ను నీల్సన్ సౌండ్ స్కాన్ ప్రారంభించిన తర్వాత ఒక వారం వ్యవధిలో ఇంతమంది ఒక పాటను డౌన్ లోడ్ చేసుకోవడం ఇదే మొదటి సారి కావడం విశేషం. కాగా గత రెండు నెలల్లో అధమస్థానంలో ఉన్న ఒక పాట పెను గంతు వేసి అగ్రస్థానానికి చేరకోవడం ఇది మూడో సారి కావడం విశేషం.
మొత్తం మీద బ్రిట్నీ స్పియర్ తిరిగి దారిలోకి వచ్చింది. గత సంవత్సరం కాలంలో అధోగతి పాలై మాదక ద్రవ్యాల సేవనంలో ఉన్మాద స్థితికి చేరుకుని మృత్యుముఖంలోకి పోయి కూడా తిరిగి శక్తిని పుంజుకున్న బ్రిట్నీ గోడకు గుద్దుకున్న బంతిలా రెట్టింపు వేగంతో పాప్ సంగీతంలోకి దూసుకొచ్చింది. దీనికి ఆమె తాజా పాట ఉమనైజర్ సాధించిన అద్భుత విజయమే తార్కాణం.