తాను జీవిస్తున్న ప్రస్తుత జీవితం జైలుకంటే నరకంగా ఉందని ప్రముఖ పాప్ గాయని బ్రిట్నీ స్పియర్స్ వెల్లడించింది. పాత జ్ఞాపకాలను మరిచిపోవాలని శాయశక్తులా ప్రయత్నిస్తున్నానని, హృదయంలో కొత్త తేజాన్ని నింపుకోవాలని చూస్తున్నానని ఆమె చెప్పింది.
అయితే ఏమాత్రం స్వతంత్ర్యం లేకుండా... "గ్రౌండ్‌హాగ్ డే" సినిమాలో కథానాయకుడు ఏవిధంగా మూస జీవితాన్ని గడుపుతాడో..? అదే తరహాలో గడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్పియర్స్ వాపోయింది. జీవితంలో ఏమాత్రం మార్పు గోచరించడం లేదని, ఉత్సాహం పూర్తిగా లోటైందని స్పియర్స్ చెప్పుకొచ్చింది.
ఫ్యాషన్ అంటే తనకెంతో ఇష్టమని, తన జీవితంలో ఒకప్పుడు హాయిగా గడిపిన మంచిరోజులున్నాయని బ్రిట్ని చెప్పింది. అయితే ప్రస్తుతం గడుపుతున్న ప్రతి రోజూ దుర్ధినంగానే అనిపిస్తోందని ఓ కొత్త డాక్యుమెంటరీలో స్పియర్స్ వెల్లడించింది.
జైలు జీవితానికైనా.. ఇన్నిరోజులనే గడువుంటుందని, అయితే... ప్రస్తుతం తాను జీవిస్తున్న ఈ జీవితానికి ఓ అంతం లేకుండా పోయిందని బ్రిట్ని స్పియర్స్ తెలిపింది. మొత్తానికి... తన ఫ్రీడెమ్‌ను పూర్తిగా కోల్పోయానని బాధపడింది.
పరిస్థితికి అనుగుణంగా మారాలనుకుంటున్నప్పటికీ.. వీలు కావడం లేదని బ్రిట్నీ పేర్కొంది. "గూటిలో చిలుకలా" కాకుండా స్వతంత్ర్యంగా జీవించాలని అనుకుంటున్నానని బ్రిట్ని స్పియర్స్ ఆ డాక్యుమెంటరీలో తెలిపింది.