2007లో హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా బంగారు ఏనుగు గెలుచుకున్న "ఇన్‌విజిబుల్ వింగ్స్" అనే చైనా చిత్రాన్ని తెలుగులో "నింగినేల నాదే" పేరుతో అనువదిస్తున్నారు. నాలుగు సంవత్సరాల పాప గాలిపటంతో ఆడుకుంటూ ఉంటుంది.
ఆ గాలి పటం కాస్త ట్రాన్స్‌ఫార్మర్‌లో చిక్కుకుంటుంది. దాన్ని తీసే ప్రయత్నంలో విద్యుద్ఘాతకానికి గురై రెండు చేతులు పోగొట్టుకుంటుంది. మొదట్లో మానసికంగా కుంగిపోయినా... క్రమంగా కోలుకుని ఆ పాప ఆత్మవిశ్వాసంతో ముందడుగువేస్తుంది.
కాలు సాయంతో ప్రతి పని చేసుకుంటూ అనుకున్న గోల్ రీచ్ అవుతుంది. మార్కులు తక్కువొచ్చి పరీక్ష ఫెయిలయ్యామని, ఎంసెట్‌లో ర్యాంక్ రాలేదని, ప్రేమించి మోసపోయామని బాధపడేవారికి "ఇన్‌విజిబుల్ వింగ్స్" అనే చైనా చిత్రాన్ని తెలుగులో "నింగినేల నాదే..!" అనే పేరుతో అనువదిస్తున్నామని నిర్మాత చావ సుధారాణి చెప్పారు.
ఇంకా నిర్మాత చిత్రవిశేషాలను తెలియజేస్తూ... 2007లో హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా బంగారు ఏనుగును ఈ సినిమా గెలుచుకుందని చెప్పారు. క్రీడాకారుల్లో స్ఫూర్తిని పెంపొందింపజేసేందుకు వీలుగా బీజింగ్ ఒలింపిక్స్ తొలిరోజు ఈ చిత్రాన్ని చైనాలో ప్రదర్శించారు. దేశవిదేశాల్లో అనేక అవార్డులను ఈ చిత్రం గెలుచుకుందని సుధారాణి ఈ సందర్భంగా తెలియజేశారు.
యధార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిందని, "లీనింగ్ యావో" ప్రధాన పాత్ర పోషించిందని సుధారాణి వివరించారు. చిత్రాన్ని అనువదించే క్రమంలో బీజింగ్ వెళ్లి దర్శకుడు ఫెంగ్ జెంజిని కలిసి ఇలాంటి చిత్రం ఎందుకు తీయాల్సి వచ్చిందో అడిగి తెలుసుకున్నామని, యువతీయువకుల ఆత్మహత్యలు ఎక్కువైన క్రమంలో స్ఫూర్తినిచ్చి వారి మనసు మార్చలన్న ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తీసినట్లు సుధారాణి తెలిపారు.
పేపర్లో వచ్చిన కథను ఆధారంగా తీసుకుని వివరాలు సేకరించారని, యువతరానికి ప్రేరణగా నిలిచే ఈ చిత్రాన్ని భారతదేశంలోని ప్రతి మూలకూ తీసుకెళ్లే ప్రయత్నంలో ఆల్ ఇండియా రైట్స్ తీసుకున్నామని సుధారాణి చెప్పారు. హిందీలో కూడా డబ్ చేస్తున్నామని, డబ్బింగ్ చేసేటప్పుడు సన్నివేశాలకు చలించి బయటికొచ్చి గొంతు సరిచేసుకుని మరీ చెబుతున్నారని సుధారాణి వెల్లడించారు. "లీనింగ్ యావో"కు హరిణి డబ్బింగ్ చెబుతోందని, ఇప్పటికే డబ్బింగ్ పూర్తై, మిక్సింగ్ నడుస్తోందన్నారు.
సుజన్ మీడియా వర్క్స్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి మాటలు... వెన్నెలకంటి, పాట.. చంద్రబోస్, సంగీతం... వందేమాతరం శ్రీనివాస్.