శృంగార తారగా ప్రపంచ ప్రేక్షకులను అలరించిన ఏంజెలీనా జోలీ... తాజాగా తన నటనా జీవితానికి స్వస్తి చెప్పనున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అనాధ పిల్లలను దత్తత తీసుకుని, వారికి ఓ మంచి జీవితాన్ని అందిస్తూ, మానవత్వానికి మారుపేరుగా నిలుస్తున్న ఏంజెలీనా... ప్రస్తుతం మాతృత్వమే అందమంటోంది.
కొన్ని నెలల క్రితం జోలీ కవల పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో దత్తత తీసుకున్న వారితో సహా ఏంజెలీనాకు మొత్తం ఆరుగురు పిల్లలు. అందంగా మేకప్ చేసుకోవడం, మ్యాగజైన్ మొదటి పేజీలో మన ఫోటో రావడమే సౌందర్యమని అందరూ భావిస్తుంటారు.
అయితే ఏంజెలీనా ఏమంటుందో తెలుసా? మాతృత్వమే తన ముఖానికి మరింత అందాన్నిచ్చిందని ఓ డెయిలీ మెయిల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. తాను తల్లైన తర్వాతే తన ముఖం పరిపూర్ణత చెందిందని జోలీ అంటోంది.
మాతృత్వానికి మించిన ఆనందం లోకంలో లేదని, వయసు పెరిగే కొద్ది ఏ మాత్రం ఆందోళన చెందడం లేదని ఏంజెలీనా చెబుతోంది. వయస్సు పెరిగే కొద్దీ తాను అమ్మలాగే కనిపిస్తానని, అదే తనకు పూర్తి సౌందర్యమని, తన ముఖంలోనే ఓ అమ్మను చూసుకుంటున్నానని జోలీ పేర్కొంది.