ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న పాప్‌స్టార్ బ్రిట్నీ స్పియర్స్ 2009లో తన జీవన విధానంలో పూర్తిగా మార్పులు గమనించవచ్చని తెలిపింది. గ్లామర్ మేగజైన్‌కిచ్చిన ఇంటర్యూలో కొత్త సంవత్సరం 2009లో తాను తీసుకోబోయే పలు అంశాలను చర్చించింది.
" అనునిత్యం మథనపడటాన్ని మానుకోవాలని ప్రయత్నిస్తున్నా. ఎందుకంటే ఇప్పటివరకూ దీనితోనే కాలమంతా వృధా పోయింది. అంతేకాదు సంతోషంగా ఉండటానికి అనుసరించాల్సిన మార్గాలేవిటో తెలుసుకుంటున్నా. అదేవిధంగా ప్రతి విషయంపై తీక్షణంగా ఆలోచించడానికి ఫుల్‌స్టాప్ పెట్టాలనుకుంటున్నా.
ప్రస్తుతం నేను చేస్తున్న ఆల్బమ్స్ నాకు సంతోషాన్నిచ్చే ఔషధాలుగా పనిచేస్తాయనుకుంటున్నా. చెప్పాలంటే... నా సంగీతానికి నా రుగ్మతలను తొలగించే శక్తి ఉంది. అందుకే మరిన్ని ఆల్బమ్స్ చేయాలనుకుంటున్నాన"ని చెప్పింది బ్రిట్నీ.