చైనా భాషలో నిర్మితమైన "ఇన్‌విజిబుల్ వింగ్స్" అనే చిత్రాన్ని "నింగినేల నాదే" అనే పేరుతో తెలుగులో చావా సుధారాణి అనువదించారు. ఒక ప్రమాదంలో రెండు చేతులను పోగొట్టుకున్న అమ్మాయి, కేవలం ఆత్మస్థైర్యంతో కాళ్ళనే చేతులుగా భావించి తన లక్ష్యాన్ని చేరుకోవడమే ఈ చిత్రం ఇతివృత్తం.
అంతేకాకుండా.. స్విమ్మర్‌గా అంతర్జాతీయ స్థాయిలో పేరుతెచ్చుకుని ఎందరో వికలాంగులకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇటువంటి కథా బలమైన చిత్రాన్ని చూసిన నిర్మాత ఎంతో ప్రేరణ పొంది భారతీయ భాషల్లోనూ ఈ సినిమాను అందించే దిశగా, ఈ సినిమాకు సంబంధించిన హక్కులను పొందారు. ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసే పాత్రను "లీనింగ్ యావో" పోషిస్తోంది.
ప్రస్తుతం హిందీ, తెలుగు భాషల్లో ఈ చిత్రం అనువాదం పూర్తి చేసుకుంది. ఇటీవలే ఈ సినిమా ఆడియో మార్కెట్లోకి విడుదలైంది. అక్కినేని నాగేశ్వరరావు ఆడియోను ఆవిష్కరించి తొలి సీడీని రమేష్ ప్రసాద్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా అక్కినేని మాట్లాడుతూ... చెడు త్వరగా వ్యాపిస్తుందని, మంచికి సమయం పడుతుందన్నారు. ఈ చిత్రం చూసి ఎంతో ప్రేరణ పొందానని, రచయిత చంద్రబోస్ రాసిన పాటలు సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా ఉన్నాయని చెప్పారు.
తాను చదువుకోకపోయినా స్వశక్తితో ఆంగ్లభాషను నేర్చుకున్న సంఘటనలను గురించి కూడా అక్కినేని ఈ సందర్భంగా వివరించారు. మనిషికి ఆత్మస్థైర్యం ఎంతో ముఖ్యమనే సందేశం ఈ చిత్రంలో ఉందన్నారు. ఇటువంటి ప్రయత్నం చేసిన సుధారాణిని అభినందిస్తున్నానని తెలిపారు.
రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ... ప్రతిభను అందరూ ప్రోత్సహిస్తారని, స్వయంకృషితో ఈ చిత్రంలోని వికలాంగురాలైన అమ్మాయి ఆత్మస్థైర్యంతో అంతర్జాతీయ స్థాయిలో స్విమ్మింగ్‌లో సాధించిన విజయం.. ఎందరో అట్టడుగున ఉన్న వికలాంగులకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు.
వందేమాతరం శ్రీనివాస్ మాట్లాడుతూ... ఈ చిత్రాన్ని చూసి ఎంతో అనుభూతికి లోనైనట్టు చెప్పారు. సంగీతదర్శకుడిగా తనకు మరపురాని చిత్రమవుతుందని చెప్పారు. ఇందులో ఓ పాటను గాయని చిత్రతో పాడించడం జరిగిందన్నారు. చంద్రబోస్ అద్భుతంగా రచన చేశారన్నారు.
సుచిత్రా చంద్రబోస్ మాట్లాడుతూ.. ఈ సినిమా తననెంతగానో కదిలించిందని తెలిపారు. మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని అనువదించామని, అనువాద సమయంలో డా.అక్కినేని, రమేష్ ప్రసాద్‌ల సహాయసహకారాలు తీసుకోవడం జరిగిందని నిర్మాత చావా సుధారాణి అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హిందీ రచయిత గోయల్, తెలుగు రచయిత ప్రసాద్ పాల్గొని మాట్లాడారు.