"మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2009" కిరీటాన్ని అమెరికాలో స్థిరపడిన భారతీయ విద్యార్థి నికిటాషా మర్హావా (19) సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన భారత సంతతి యవతులు పాల్గొనే ఈ పోటీ డర్బన్‌లో జరిగింది. ఈ పోటీలో షికాగోకు చెందిన విద్యార్థి మర్హావా తన నాట్య ప్రతిభతో అందరినీ ఆకట్టుకుని 24మంది పోటీదారులలో పైచేయిగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో మర్హావా ప్రదర్శించిన భారత సంప్రదాయ నృత్యానికి న్యాయ నిర్ణేతలు, ప్రేక్షకులు మంత్ర ముగ్దులయ్యారు. ఈ పోటీలో ఆస్ట్రేలియాకు చెందిన కంచన్ వర్మ మొదటి రన్నరప్‌గా ఎంపికయ్యారు. బాలీవుడ్ నాట్యంతో ఆకట్టుకున్న నెదర్లాండ్స్‌కు చెందిన సునైనా భోండై రెండో రన్నరప్‌గా నిలిచారు. అయితే భారత్ నుంచి పోటీకి హాజరైన దీప్తీ వరుగేస్ నిరాశను మాత్రమే మిగిల్చారు.
మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2009 కిరీటాన్ని దక్కించుకున్న నికిటాషా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా తనకు స్ఫూర్తి అని, న్యాయనిర్ణేతలు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. మార్పు అనే నినాదంతో అధ్యక్ష పదవిని అలంకరించిన ఒబామా, అమెరికాలోని ప్రతి భారతీయుడికి స్ఫూర్తిగా నిలుస్తాడని ఆమె మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపింది. పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిదంటూ ఉండదంటూ మర్హావా మీడియాతో వెల్లడించారు.