లండన్‌లో 50 షోలను బుక్ చేయడంపై మైకేల్ జాక్సన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని అతని ప్రమోటర్లు తోసిపుచ్చారు. ఇంత పెద్దమొత్తంలో షోలు బుక్ అవడంపై జాక్సన్ అమితానందం వ్యక్తం చేశాడని చెప్పారు.
పాప్ కింగ్‌గా కీర్తించబడుతున్న మైకేల్ జాక్సన్ గతంలో తన అభిమానులతో ఓ2 వేదికపై పది షోలు చేయనున్నట్లు, మిగిలినవాటిని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు చెప్పారని ప్రచారం జరిగింది.
అయితే తరువాత లండన్‌లో మరో 40 బుకింగ్‌లు జరిగాయని తెలియడంతో జాక్సన్ ఆగ్రహం చెందినట్లు తెలిసింది. ఇంత పెద్దమొత్తంలో షోలు సాధ్యపడవని జాక్సన్ భావించడమే ఇందుకు కారణంగా వార్తలు వచ్చాయి.
తాజాగా ఏఈజీ లైవ్ సీఈవో రాండీ ఫిలిప్స్ మాట్లాడుతూ... ఈ కథనం పూర్తిగా అవాస్తవమన్నారు. ఇందులో నిజం లేదు. లండన్‌లో 50 షోలు బుక్ అవడంపై జాక్సన్ ఎంతో ఉత్సాహం కనబరిచారని రాండీ ఫిలిప్స్ చెప్పారు.
ప్రారంభం నుంచి మైకేల్ జాక్సన్ అందుబాటులో లేకుండా ఈ స్థాయిలో భారీ షో నిర్వహించడం సాధ్యపడదు. ప్రస్తుతానికి జాక్సన్ ప్రపంచ టూర్‌కు అంగీకారం తెలపలేదు. అతను ఎప్పుడైనా దీనికి అంగీకారం తెలిపే అవకాశం ఉందన్నారు.