బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ ప్రేక్షకులను సైతం తన అందచందాలతో ఇట్టే ఆకట్టుకోన్న అందాల తార లీసా రే.. మల్టీపుల్ మైలోమా అనే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది.
ఈ విషయాన్ని లీసా రేనే స్వయంగా తన బ్లాగులో తెలియజేసింది. జూలై 2వ తేదీ నుంచి తనకు వైద్యులు ట్రీట్‌మెంట్ ప్రారంభించారని.. జూన్ 23వ తేదీన తనకు క్యాన్సర్ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారని లీసారే తన బ్లాగులో చెప్పుకుంది.
తెలుగులో మహేష్ బాబు సరసన "టక్కరి దొంగ" చిత్రంలో నటించిన లీసా రేకు దీపికా మెహతా చిత్రం "వాటర్" మంచి గుర్తింపును సంపాదించి పెట్టింది. తాజాగా "ఐ కెనాట్ థింక్ స్ట్రెయిట్" అనే ఆంగ్ల చిత్రంలో లీసా రే లెస్బియన్ పాత్ర పోషిస్తోంది. ఈ నెల (సెప్టెంబర్) 11వ తేదీన ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది.
బెంగాలీ తండ్రి, పోలెండ్‌కు చెందిన తల్లి మూలంగా లీసా రేలో భారతీయ, పాశ్చాత్య ధోరణులు కనిపిస్తాయి. కెనడాలో పుట్టి పెరిగిన ఆమె తల్లిదండ్రులతో కలిసి బెంగాల్ వచ్చినప్పుడు 16 ఏళ్ల వయసులోనే మోడలింగ్ చేసింది. బాంబే డయింగ్ యాడ్ ఆమెకు ఎంతో పేరు సంపాదించి పెట్టింది.
ఇలా మోడలింగ్ నుంచి క్రమక్రమంగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన లీసా రే మొదటిసారిగా శరత్‌కుమార్‌తో కలిసి తమిళ సినిమాలో నటించింది. తదనంతరం బాలీవుడ్, కెనడియన్, హాలీవుడ్ చిత్రాల్లోనూ, ప్రకటనల్లోనూ నటించిన లీసారేను టైమ్స్ ఆఫ్ ఇండియా మిలీనియంలో దేశంలోని మొదటి పది మంది అందగత్తెల్లో ఒకరుగా అభివర్ణించింది.
మైలోమా క్యాన్సర్ గురించి లీసా రే ఇంకా తన బ్లాగులో... ఈ వ్యాధిని నయం చేయడం కష్టతరమని చెప్పింది. ఇప్పటికే ఆరువేల మంది కెనడియన్లు ఈ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, ప్రతి ఏడాది సుమారు 2100 కేసులు నమోదవుతున్నాయని లీసా రె తెలిపింది.
ఇప్పటికే సినీరంగంలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న తాను నటనలో రాణించేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తానని లీసా రే తన బ్లాగులో విశ్వాసం వ్యక్తం చేసింది. అయితే తెల్ల రక్తకణాలకు సోకే ఈ క్యాన్సర్‌కు చికిత్స లేదు. క్రమేణా క్షీణించి ప్రాణాలు కోల్పోవడమే. ప్రస్తుతం తాను మెడికల్ చెకప్ మాత్రమే చేయించుకుంటున్నానని, ఎలాంటి చికిత్స చేయించుకోవడం లేదని లీసా రే వెల్లడించింది.