కోట్లు వెచ్చించినా.. ఆ ఇమేజ్ రాదు: సుమన్
|
ఇలా ఎన్నో చిత్రాలు చేసినా.. ఎన్ని వేషాలు వేసినా రాని పేరు ప్రతిష్టలు సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన 'శివాజీ'తో రావడం ఊహించని అదృష్టంగా భావిస్తున్నారు సుమన్. ప్రస్తుతం నీలకంఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జెనీలియా తండ్రిగా నటిస్తున్నారు. ఆ షూటింగ్ గ్యాప్‌లో ఆయనను పలుకరించగా....
ప్ర: మీల 30 ఏళ్ల సినీ జీవిత విశేషాలు ఏమిటి?
సు: నా 30 ఏళ్ల సినీ కెరీర్లో ఎంతో మంది దర్శకుల వద్ద పనిచేసినా ఇంకా ఏదో తెలియని వెలితి ఉందనిపించేది. చాలామంది అంటుండేవారు... నా బాడీ లాంగ్వేజ్‌కు సరిపడా పాత్రను ఏ దర్శకుడూ ఉపయోగించుకోలేదని. అయితే.. 'శివాజీ' చిత్రంతో ఆ లోటు తీరింది. ఇంకో విషయం ఏమిటంటే.. 25 ఏళ్ళ క్రితం న్యాయం మీరే చెప్పాలిలో కాస్త నెగటివ్ టచ్ ఉన్న పాత్రను పోషించాను. అందులో కథానాయుకుడిని నేనైతే గెస్ట్‌గా వచ్చే పోలీసు పాత్ర రజనీకాంత్ పోషించారు. అయితే.. ఇపుడు అంటే.. తొలినాళ్ళలో రజనీ ఎలా ఉన్నారో.. ఇంత పెద్ద ఇమేజ్ సాధించినప్పటికీ ఆనాటి రజనీయే నా ముందు ఉన్నట్టు ఫీలయ్యాను.
ప్ర: ప్రస్తుతం సినిమాల ట్రెండ్ ఎలా సాగుతోంది?
సు: జీవితంలో రిస్క్ లేకపోతే ఏమీ సాధించలేం. ఏదో జరుగుతుందని ఆలోచిస్తూ.. భయపడుతూ కూర్చొనేకన్నా దాన్ని అమలు చేయడమే ఉత్తమం. హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి విలన్‌గా చేయడమే కష్టం. అసలు ప్రేక్షకులు ఆ పాత్రలో ఆమోదించడం అంత తేలికైన విషయమేమీ కాదు. ఈ పరిస్థితుల్లో నేను తీసుకున్నది రిస్కే. అయినా కొన్ని లెక్కల్తో తీసుకున్న రిస్క్ అది. మొదటిది.. దర్శకుడు శంకర్ కావడం. రెండోది.. రజనీకాంత్ చిత్రం కావడం. మూడోది.. ప్రతిష్టాత్మకమైన ఏవీఎం సంస్థ కావడం. అందుకో నేను ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. శంకర్ చిత్రమంటే ప్రేక్షకుల్లో ఓ క్రేజ్ ఉంది. ఆయన తీసిన చిత్రాన్ని ఒక్కసారైనా చూడాలని ప్రతి ప్రేక్షకుడు భావిస్తారు. అలాగే.. నేనూ. ఆయన చిత్రంలో ఒక్క సీన్లో అయినా కనిపించాలని భావించాను. అందుకే ఆదిశేషు పాత్రను పోషించాను.
ప్ర: మీకు ఆ అవకాశం ఎలా దక్కింది?
సు: మొదటగా ఈ పాత్రకు అమితాబ్ బచ్చన్‌ను అనుకున్నారనీ కొన్ని వైబ్‌సైట్స్ రాశాయి. అయితే.. శంకర్ సినిమాకి ఏడాది పాటు కాల్షీట్ ఇవ్వడం కుదరక ఆయన విరమించుకున్నట్టు తెలిసింది. ఆ తర్వాత సంజయ్‌దత్, ఆయన టాడా కేసు చిక్కుల్లో ఉండటం వల్ల సాధ్యపడలేదు. అనంతరం నానాపటేకర్. ఈయనా హాలీవుడ్ చిత్రంలో బిజీగా ఉండటంతో అదీ కుదరలేదు. ఉత్తరాది నటులు అయిపోయాక, మళయాళ స్టార్ మోహన్‌లాల్‌ను అనుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో నాకు తెలియదు. ఓ రోజు శంకర్ ఆఫీసు నుంచి నాకు ఫోన్ వచ్చింది. వేరే చిత్రానికనీ వెళ్లాను. చివరకు అక్కడకు వెళ్లాక శివాజీ చిత్రానకీ తెలిశాక చాలా సంతోషపడ్డాను.
ప్ర: ప్రస్తుతం మీ ఇమేజ్ ఒక్కసారి పెరింగిందనుకుంటున్నారా?
సు: నిజమే.. ఇన్నేళ్లూ నా కెరీర్లో కేవలం ఒక్క 'శివాజీ' సినిమా ద్వారా ప్రపంచానికి తెలిసిపోయాను. యూఎస్, యూకే, దక్షిణాఫ్రికా, దుబాయ్, జపాన్, మలేషియా ఒకటేంటి ఖండాంతరాల్లో నా పేరు మోగుతోంది. కోట్లు ఖర్చు పెట్టినా అంత పబ్లిసిటీని సంపాదించుకోలేను.
ప్ర: ఇకపై ప్రతి నాయకుడు పాత్రల్లో చేస్తారా?
సు: ఎస్. చేస్తాను. శివాజీ తరహా కాకుండా.. వైవిధ్యమైన పాత్రల్లో చేసేందుకు సిద్ధం.
ప్ర: రజనీతో పనిచేయడం ఎలా ఫీలవుతున్నారు?
సు: ఒకటి కాదు రెండు రోజులు కాదు.. ఏడాది పాటు రజనీతో పనిచేసే భాగ్యం దక్కినందుకు ఎంతో సంతోషపడ్డాను. హీరో తండ్రింగా, అన్నయ్యగా, బాబాయ్‌గా పలు పాత్రలు చేసినా నన్ను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కొత్త కోణంలో చూపించారు. ఇపుడు శంకర్ విలన్‌గా ప్రజెంట్ చేశారు. ప్రేక్షకుల్లో.. తనకంటూ ఓ గుర్తింపును తెచ్చారు. అదే.. సుమన్ ఏ పాత్రలోనైనా చేయగలడు, పోషించగలడు అనే నమ్మకాన్ని తెచ్చారు. అది చాలు ఈ జన్మకు.
ప్ర: మీ చేతిలో ఉన్న ప్రాజెక్టులు ఏమిటి?
సు: నీలకంఠ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో హీరోయిన్ తండ్రిగా చేస్తున్నాను. అలాగే.. నాగార్జున తాజా చిత్రం డాన్, దాసరి నారాయణ రావు చిత్రంలో రాజకీయ ప్రాధాన్యత కలిగిన పాత్ర, అన్నపూర్ణా సంస్థ సుమంత్ హీరోగా తీసే చిత్రంలో సహా మరో రెండు చిత్రాలను అంగీకరించాను.
