1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ముఖాముఖి

నాపై ఇంగ్లీష్ చిత్రాల ప్రభావం ఉంటుంది: పూరీ

బద్రి
WD PhotoWD
"బద్రి" "ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం", "ఇడియట్", "శివమణి", "అమ్మానాన్న ఓ తమిళమ్మాయి", "దేశముదురు", "పోకిరి" వంటి సక్సెస్ చిత్రాలకు దర్శకత్వం వహించివ పూరీ జగన్నాథ్ నిర్మాతగా కూడా తన టాలెంట్ నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. చిన్న చిన్న చిత్రాలకు వైష్ణో అకాడమీ బేనర్‌పై రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు. తమిళ శంకర్ ఆదర్శమా అన్న ప్రశ్నకు నవ్వుతూ అటువంటిదేమీలేదంటారు.

తాను సహజంగా తెలుగు చిత్రాల్ని చూడననీ, అంతా ఇంగ్లీషు ప్రభావం తన చిత్రాలపై ఉంటుందని నిర్భయంగా చెబుతున్నారు. తొలిసారిగా మరో నిర్మాత "దిల్" రాజుతో కలిసి "హలో ప్రేమిస్తారా" అనే సినిమాను నిర్మించారు. "1 4 3" చిత్రంతో హీరోగా పరిచయం అయిన ఆయన సోదరుడు సాయిరాం శంకర్ హీరో. షీలా హీరోయిన్‌. "వర్షం" ఆధారంగా తమిళంలో "నాలై" అనే చిత్రాన్ని రూపొందించిన రాజ్‌కుమార్ దీనికి దర్శకుడు. ఈ చిత్రం ఈ నెల 30న విడుదలకానుంది. ఈ సందర్భంగా పూరీజగన్నాథ్ వెల్లడించిన విశేషాలు...

ప్రశ్న: "హలో ప్రేమిస్తారా" అని ఎవర్ని ఎవరంటారు? చిత్ర విశేషాలేమిటి?
జ: హీరో హీరోయిన్‌తో హలో "హలో ప్రేమిస్తారా" అని అడిగే వైనమే వైవిధ్యంగా ఉంటుంది. చిత్రవిశేషాలంటే... ఎయిర్‌టాక్ మొబైల్ నెట్‌వర్క్‌లో జాబ్ చేసే ఒక కుర్రాడు, ఈటీవీలో యాంకర్‌గా పనిచేసే ఒక యువతిని "హలో ప్రేమిస్తారా" అని ఏవిధంగా చేశాడు అన్నది పాయింట్.

ప్రశ్న: దర్శక నిర్మాతగా ఒకస్థాయి ఉన్న మీరు మరో నిర్మాతతో కలిసి నిర్మించడానికి కారణాలేమిటి?
జ: దర్శకుడు రాజ్‌కుమార్ చెప్పిన కథ దిల్‌రాజుకు నచ్చడంచో, నాకు వినిపించమని అతన్ని నా దగ్గరకు పంపాడు. కథ విన్నాను. అయితే రాజ్‌కుమార్ చెప్పిన కథ రెగ్యులర్ టైప్‌ అయినా దాన్ని స్క్రీన్‌ప్లే వివరిస్తుంటే ఆ సబ్జెక్టుపై అతను ఎంత మమేకం అయ్యాడో గమనించాను. ఇతనే సరిగ్గా డీల్‌ చేయగలడని దర్శకత్వం అప్పగించాను. అసలు ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడే నేనే చేద్దామనుకున్నా. వేరే చిత్రాల్లో బిజీగా ఉండడం, దిల్‌రాజు కూడా సినిమా మేకింగ్‌లో ఉండడంతో ఇద్దరు కలిసి చేయడం సబబమని అనుకున్నాం.

ప్రశ్న: ఒక దర్శకుడిగా మరో దర్శకుడికి ఏవిధమైన సలహాలు ఇచ్చారు?
జ: ఎక్కువేం ఇవ్వలేదు, ఎందుకంటే ఒక చిత్రం సక్సెస్ కావడానికి దర్శకుడి పాత్ర ఎంతవరకు ఉంటుందన్నది ఒక దర్శకుడిగా నాకు తెలుసు. ఎంతో కష్టపడి తయారు చేసుకుని అందులో ఇన్‌వాల్వ్‌ అయిన దాన్ని ఒక మంచి చిత్రంగా తీయాలని ప్రతి దర్శకుడికీ ఉంటుంది. అందుకే ఆ విషయాల జోలికి పోకుండా... మావాడు పెద్ద హీరోకాదు. ఆర్భాటాలేమీలేకుండా సింపుల్‌గా ఎంత తక్కువ బడ్జెట్‌తో తీయగలవో నీవరకే వదిలేస్తున్నా అని మాత్రమే అనగలిగాను.

ప్రశ్న: ఆడియో రిస్పాన్స్ ఎలా ఉందని ఫీలవుతున్నారు?
జ: చక్రి మా ఇంటివాడు. నా చిత్రాలన్నింటికీ పనిచేశాడు. ఈ చిత్రంలో "నిన్న మొన్న ఎదలో" అనే పాట నాకు బాగా నచ్చింది. ఈ ట్యూన్స్ ఇచ్చినప్పుడు హాంకాంగ్‌లో ఉన్నా. అది విని ఈర్షపడ్డా. నేను దర్శకత్వం వహించే చిత్రాలకు ఇటువంటి ట్యూన్స్ ఎందుకు ఇవ్వవు అని అడిగాను. నవ్వి ఊరుకున్నాడు. ప్రేక్షకుడు థియేటర్‌కు వచ్చేవిధంగా పాటలు ఉన్నాయని చెప్పగలను.
WD PhotoWD


ప్రశ్న: నిర్మాతగా మరిన్ని సినిమాలు తీసే ఆలోచన ఉందా?
జ: తప్పకుండా. నేను నిర్మాతగా ఇతర దర్శకుల కలయికలో రూపొందే చిత్రాలకు ఈ చిత్రం ఆరంభం. మా బేనర్‌లో పలు చిత్రాల్ని నిర్మించాలనే సంకల్పించుకున్నాను. ఏ దర్శకుడైనా మంచి కథతో నిన్ను కన్వినెన్స్‌ చేస్తే నిర్మాతగా నేను సిద్ధం.

ప్రశ్న: చాలామంది దర్శకులు హీరోలు అవుతున్నారు. మీకటువంటి ఆలోచన ఉందా?
జ: లేదు. ప్రతి డైరక్టర్‌లోనూ ఒక హీరో ఉంటాడు. అలాగే ప్రతి హీరోలోనూ ఒక డైరక్టర్‌ ఉంటాడు. అయితే డైరక్టర్‌లోని హీరో, హీరోలోని డైరక్టర్ ఒకేసారి బయటకు రాకుండా చూసుకోవాలి. ఎవరి పనివాళ్ళు చేసుకుంటే మంచిది. నేనొక దర్శకుడిగా హీరోతో ఎలా చేయించుకోవాలో తెలుసు. కానీ ఎలా చేయాలో తెలీదు. అలాగే ఎలాంటి కథలు బాగుంటాయో హీరోలకు తెలుసు... కానీ వాళ్ళే కథలు రాసుకోలేరు కదా...
WD PhotoWD
ప్రశ్న: పూరి జగన్నాథ్, "దిల్‌" రాజు పేర్లు సినిమాకు ఎంతవరకు ఉపయోగపడుతాయి?
జ: ఉదయం ఆట ఓపెనింగ్స్‌కి మాత్రమే ఉపయోగపడతాయి. ఆ తర్వాత సినిమా బాగుంటే ఆడుతుంది.

ప్రశ్న: ఈ మధ్య కాలంలో మీకు బాగా నచ్చిన తెలుగు చిత్రం?
జ: అసలు తెలుగు సినిమా చూడడమే మానేశాను. ఆ మధ్యకాలంలో చిరంజీవిగారి చిత్రాలు మూడు ("ముగ్గురు మొనగాళ్ళు", "హిట్లర్", "ఇంద్ర") చూశాను. ప్రీమియర్‌ షో అని "ఇంద్ర" మరో సందర్భాల్లో ఆయా చిత్రాలు చూశాను. నేను ఫలానా హీరోతో సినిమా తీయాలనుకుంటే అప్పుడు ఆ హీరో నటించిన చిత్రం చూస్తాను. మహేష్‌బాబుతో "పోకిరి" తీస్తాననగా "ఒక్కడు", పవన్‌తో "బద్రి" సినిమాకి ముందు "తొలిప్రేమ" చూశాను.

నా తదుపరి చిత్రం ప్రభాస్‌తో. ఇంతవరకు అతని సినిమా చూడలేదు. నాపై ఇంగ్లీష్ చిత్రాల ప్రభావం ఉంటుంది. అందుకే ఇంగ్లీష్ చిత్రాలే చూస్తాను. పవన్‌కళ్యాణ్‌కి "బద్రి" కథ చెబుతున్నప్పుడు ఈ సన్నివేశం "ఇక్కడ అమ్మాయి- అక్కడ అబ్బాయిలో ఉంది కదూ! అన్నారు. మరో సందర్భంలో ఇలాంటిదే "గోకులంలో సీత"లో కూడా ఉంది కదూ అని అడిగారు. ఏమో తెలియదండీ. ఆ చిత్రాలు చూడలేదు అన్నాను. "అవేవీ చూడకుండా నాతో సినిమా ఎలా తీస్తావ్" అన్నారు. మీ టైం బాగుంది.. మీతో గనుక తీస్తే బిజినెస్ అవుతుంది... మీరు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారని అందరూ అంటున్నారన్నాను. నవ్వి ఊరుకున్నారు.

ప్రశ్న: చిరంజీవి తనయుజు రామ్‌చరణ్ తేజ సినిమా "చిరుత" ఎంతవరకు వచ్చింది?
జ: మూడు పాటలు బేలన్స్ తప్ప సినిమా పూర్తయింది. రామ్‌చరణ్ తేజ తొలి చిత్రమైనా అతని పర్‌ఫార్మెన్స్ ఈ చిత్రానికి హైలైట్. మణిశర్మ సంగీతం ఆడియోకు ప్లస్ అవుతుంది.

ప్రశ్న: హీరో గత చిత్రాలేమీలేవు. ఎలా దర్శకత్వం వహిస్తున్నారు?
జ: ఈ సినిమాకు దర్శకత్వం వహించమని నిర్మాతే కోరాడు. అందుకే చేస్తున్నాను.
About Writer
WD