తెలుగు సినిమా బిడ్డను నేను: అక్కినేని
|
పద్నాల్గవ ఏటనే `సీతారామజననం` చిత్రంలో కళ్యాణరాముని పాత్రతో ఘంటసాల బలరామయ్య ఆయనకు సినికెరీర్‌ను అందించారు. అయితే శాంతకుమారి, భానుమతి నటించిన `ధర్మపత్ని`లో అక్కినేని అతిథి పాత్రలో నటించగా ఈ చిత్రమే ముందు విడుదలయింది. అప్పటినుంచి ఇప్పటివరకు అక్కినేని సుమారు 66 ఏళ్లకుపైగా సినిమారంగంలో రాణించటం విశేషం.
ఆయన కెరీర్‌లో మర్చిపోలేని చిత్రం `దేవదాసు`. అందులో ఒంటిపూట భోజనం చేసి బాగా చిక్కిపోయి చాలా కష్టపడి నటించారనీ అందరూ అనుకోవటం ఓ అపోహే. ఆ చిత్రం షూటింగ్ జరుగుతున్నంతకాలం సుష్టుగా భోంచేనంటారాయన. ఆయనకు 1974 అక్టోబర్‌లో గుండెజబ్బు వచ్చింది. ఆయనకు బైపాస్ సర్జరీ చేశారు. మళ్ళీ 1988లో గుండెపోటు వచ్చినా ఆపరేషన్ చేస్తే బ్రతకరని వైద్యులు ఆపేశారు.
ఇవన్ని ఎ.ఎన్.ఆర్‌కు తెలుసు. అందుకే నా అభిమానుల ఆశీర్వాదం నన్ను చనిపోనిస్తుందా? అని ఎదురు ప్రశ్నిస్తారు. ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మభూషణ్, నటసామ్రాట్, డాII అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు ఆగస్టు 20. 1923 ఆగస్టు 20న కృష్టాజిల్లాలోని గుడివాడకు సమీపాన కుదరవల్లి గ్రామాన్ని ఆనుకుని వున్న రామాపురంలో ఆయన జన్మించారు. అయితే రికార్డ్ ప్రకారం సెప్టెంబర్ 21 ఆయన జన్మదినం. కాని ఆయన పుట్టినరోజును అభిమానులు 20వ తేదీన జరుపుకుంటారు. వివరాలు ఆయన మాటల్లోనే...
ప్ర: మీ పుట్టినరోజు సెప్టెంబరు 21 అంటారు, కానీ ఆగస్టు 20నే అభిమానులు జరుపుతుంటారు కారణం?
జ: నాకు పుట్టినరోజును జరుపుకునే అలవాటు పెద్దగా లేదు. అఫీషియల్‌గా నా పుట్టినరోజు సెప్టెంబర్ 21. నా మాతృమూర్తిని `కథానాయకుడు` చిత్ర రచయిత రమణ ఓసారి ఇంటర్వూచేస్తే, మావాడు శనివారం జాముపొద్దుపోయాక పుట్టాడని చెప్పింది.
ఆ తర్వతా ఐదురూపాయల ఇన్సూరెన్స్ కోసం పుట్టినరోజు పత్రంలో 21 అని రాయటం జరిగింది. అందుకే రికార్డుల్లో నా పుట్టినరోజు సెప్టెంబర్ 21. కానీ అభిమానులు 20నే ఎందుకు చేస్తున్నారంటే... ఆ తర్వాత `బుద్ధిమంతుడు` రిలీజ్ 20న వచ్చింది. అందుచేత నిర్మాత నా దగ్గరకు వచ్చి`సార్.. బర్త్‌డే రిలీజ్ అని చేయమంటారా?` అన్నారు..సరే వేయండి అన్నాను. అప్పటినుంచి అలా జరిగిపోతోంది.
ప్ర: నటునిగా ప్రపంచ రికార్డ్ సృష్టించారు. ఎలా ఫీలవుతున్నారు?
జ: సినిమా బిడ్డను నేను. ఏమీ తెలియని నన్ను ఇంతవాణ్ణి చేసింది. నాలో ఉన్న లోపాలు నాకు తెలుసు. రామరావుగారిలా పర్సనాలిటీ లేదు. జగ్గయ్యగారిలా వాయిస్ లేదు. రంగారావుగారిలా ఎత్తు లేను. ఇదంతా ప్రేక్షకులు ఇచ్చిన గుర్తింపే. మంచి వేషాలిచ్చి బంగారు భవిష్యత్ ప్రసాదించింది మదర్ ఇండస్ట్రీ. తోటి నటీనటులు, దర్శకనిర్మాతలు మంచి పాత్రలు నాచేత వేయించి ఇంతటివాడిని చేశారు. నిజంగా సంతోషంగా ఉంది.
|
జ: ఎందుకు పనికిరాని వాడిని.. ఓ స్త్రీ మనిషిగా తయారు చేయవచ్చని `అర్థాంగి` చిత్రంలో తెలుసుకున్నాను. ఎంత చెడ్డవాడ్ని అయినా బాగు చేయగల సామర్థ్యం స్త్రీ మూర్తికి ఉందని `ప్రేమ్‌నగర్` చూపింది. ఇక భార్యభర్తల అనుబంధం ఎలా ఉండాలో `భార్యభర్తలు` సినిమా నేర్పింది.
అప్పట్లో... ఇతను లైలామజ్నుకి పనికిరాడు, దేవదాసుకు సూట్‌కాడు. లోతుకళ్ళు, పీలగొంతు ఇతనేం `కాళిదాసు` చేస్తాడని ఎందరో దర్శకులు అన్నారు. అక్కడనుంచే నాలో పట్టుదల పెరిగింది. అన్నీ చేసి వారిచేత శభాష్ అనిపించుకునేలా ప్రేరేపించింది.
ప్ర: గతంలో వేమన పాత్ర చేయాలనుంది అన్నారు. అంతలా ఆకట్టుకోవడానికి కారణం?
జ: ఇరవై ఏళ్ళక్రితం వేమన పాత్ర చేయాలని ఉండేది. నాగయ్యగారు చేసిన వేమన సినిమాలో కుర్ర వేమన కథ తీయలేదు. సామాజిక స్పృహ, రక్తి, భక్తి మూడు కోణాలు మిగిలి ఉన్నాయి. అందుకే అది చేస్తే బాగుండు అనుకున్నా. అయితే అది ఊహగానే మిగిలిపోయింది.
ప్ర: అది మీ బ్యానర్‌లోనే తీయవచ్చుకదా?
జ: 50-55 ఏళ్ళప్పుడు ఆ పాత్ర చేయాలనిపించింది. అయితే అప్పట్లో అది కుదరలేదు. ఇప్పడు వయస్సు సహకరించదు. నా దృష్టిలో నాగార్జునకైతే బాగుంటుంది. `అన్నమయ్య` నేను చేయవల్సింది. కానీ నాగార్జునకు ఆ అవకాశం వచ్చింది. అలా నాగ్‌కు మళ్ళీ వస్తూందేమో చెప్పలేను. ఒకవేళ నాగార్జున చేయకపోతే ఎవరు చేసినా సంతోషమే.
ప్ర: `దేవదాసు` చిత్రంలో లంకణాలు ఉన్నారని అందుకే బాగా పండిందని ఆనాడు పత్రికలు రాశాయి? ఆనాటి దేవదాసు విషయాలు చెప్పగలరా?
జ: అందరికీ తెలీని రహస్యం ఒకటుంది. నేను అప్పుడు లంకణాలు ఉన్నానని అనడం పచ్చి అబద్ధం. సుష్టిగా భోంచేశాను. ఆ షాట్ ఎలా తీశారంటే..బాగా భోంచేశాక రాత్రిపూట ఎలాగూ మాంచి నిద్ర వస్తుది. కళ్ళు మూతలు పడతాయి. సరిగ్గా అర్థరాత్రి రెండు గంటలకు షాట్స్ తీశారు.
మత్తుకళ్ళతో, తడబడే మాటలతో నిద్రలేక మొహం పీక్కుపోవడం వంటి లక్షణాలు నిద్ర ఆపుకుంటేనే వచ్చేవి. అలా అంతకష్టపడి తీశారుకాబట్టే అంత పేరు తెచ్చిపెట్టింది. ఇదంతా దర్శకుడి ప్రతిభ.
ప్ర: దేవుడులేడని చెబుతుంటారు. కానీ మీ ఇంట్లో ఎక్కడ చూసిన దేవుని ప్రతిమలే కన్పిస్తాయి?
జ: యస్ కరెక్ట్. దేవుడు లేడని ఎలా అనుకుంటానో...ఉన్నాడని అలానే అనుకుంటాను. దేవుడు అంటే ఆత్మ అని నాదృష్టిలో అర్థం. ఈ సృష్టిలో ఏదో తెలీని శక్తి మనందరినీ నడిపిస్తుంది. దానికి రకరకాల దేవుళ్ళ పేర్లు పెట్టాం.
నీలోనూ నాలోనూ దేవుడనే ఆత్మ ఉంది. నీ చేత ఇలా ప్రశ్నలు వేయిస్తుంది. నాచేత ఇలా సమాధానం చెప్పిస్తుంది. మనకు తెలీని ఆ పవరే. నీకంటే గొప్పవాడు వున్నాడు అని నమ్మినట్లే.
ప్ర: ఇప్పటి తరానికి మీరిచ్చే సలహా?
జ: నేను సలహాలివ్వాల్సిన స్థితిలో వారులేరు. ఇప్పుడంతా విద్యావంతులే వస్తున్నారు. ఒక్కటి చెప్పగలను. ఫ్యాషన్ కోసం సినిమాకు రాకండి. ఇదొక వృత్తిగా భావించి పవిత్ర భావంతో వస్తే ఫలితాలుంటాయి.
ప్ర: వంశపారంపర్యనటులంటే నాటకరంగంలో సురభి అంటారు. సినిమాలో మీవంశమని అనుకోవచ్చా? విదేశాల్లో చదివిన మీ వారసులు ఆఖరికి సినిమాపై మొగ్గుచూపడానికి కారణం?
జ: నేనుపెద్దగా చదువుకోలేదు. అందుకే మా వాళ్లకు చదువు చెప్పించాను. ఒకరు డాక్టర్ కావాలనుకుంటారు. కాదు ఇంజనీర్ చేయమని మనం చెప్పలేం. అది వాళ్ళ అభిరుచి. దానిని కాదనే హక్కు నాకులేదు. అలాగనీ నేను ఎవరినీ ప్రోత్సహించను. వారు వస్తానంటే వద్దనను.
ప్ర: ఈ మధ్య నటనకు దూరంగా ఉన్నారు? మీ నాల్గవ తరంవారితో నటించే ఆలోచన ఉందా?
జ: మూడు తరాలవాళ్ళతో నటించాను. నాల్గవ తరం చైతన్య, అఖిల్ వస్తే అప్పటికి పరిస్థితులు అన్నీ బాగుంటే, నాకు మంచివేషం ఇవ్వాలని వారికనిపిస్తే తప్పకుండా చేస్తాను. ఇక మిగతా చిత్రాల్లో అంటారా.. మనస్సు ఏదైన చేయాలనుంటుంది. వయస్సు అందుకు ఒప్పుకోదు.
ప్ర: ఇప్పటి చిత్రాల ఫాస్ట్‌నుచూస్తే మీకేమనిపిస్తుంది?
జ: అప్పట్లో సినిమాలను కథలు డామినేట్ చేసేవి. సంవత్సరం తీసినా కథపై శ్రద్ధచూపేవారు. ఈనాడు ఏడాదికి లెక్కలేనన్ని సినిమాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కథ వెనుకబడిపోయి టెక్నికల్ ముందుకు వచ్చింది. నేటి పరిస్థితిలో టెక్నిక్ అవసరమేగానీ కథను మాత్రం వదలిపెట్టకూడదు. ఏదో తూ.తూ. మంత్రంగా చేసి అమ్మేసుకుందాం అంటే ఎలా కుదురుతుంది? ఆరోజుల్లో ఈ అమ్మకాలు లేవు. మన సరుకు మీద నిలబడి మన డబ్బులు రాబట్టుకోవాలి. విజయవంతమైన చిత్రం తీయాలి.
