అగ్రహీరోలే నాకు స్ఫూర్తి: శివాజి
శుక్రవారం, 4 జనవరి 2008( 18:12 IST )
మంత్ర చిత్రం పబ్లిసిటీలో మీ పేరు ప్రస్తావనే లేకపోవడానికి కారణం...?
దాని గురించి నిర్మాతలు ముందుగానే చెప్పారు. ఛార్మిపై ప్రచారం చేసి బిజినెస్ పరంగా మాకు లాభదాయకం వస్తుందని.. అందుకే ఆ దిశగా దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. అందుకు సరేనన్నాను. నా బొమ్మ కనుక వేసి ఉంటే పది సినిమాల్లో ఒక సినిమాగా మిగిలిపోయేది. అలాగే కాకుండా హీరోయిన్ ఎక్స్‌పోజింగ్ హడావుడితో యువనిర్మాతలు వేసిన మంత్రం ఫలించింది. మరదే కదా టెక్నిక్ అంటే...
మంత్ర చిత్రంలో ఒక్క పాటలో మినహా ఆమె అలా కనిపించదు కదా... మరి ఇది ప్రజల్ని మోసం చేయడం కాదా..?
మోసమా.. ఎందుకవుతుంది... వ్యాపారం అన్నాక చాలా ఉంటాయి. అవన్నీ నిర్మాతల్ని అడిగితే బావుంటుంది మరి..
అంతా కొత్త వారు... అనుభవం లేని వారు... సినిమా పూర్తి చేస్తారనుకున్నారా...?
చెప్పాలంటే ఒకానొక దశలో నాకు అలాగే అనిపించింది. సాఫ్ట్‌వేర్ కంపెనీలో తాము సంపాదించిన డబ్బంతా కూడగట్టి సినిమాకు పెట్టారు. సగం షూటింగ్ పూర్తయింది. డబ్బుల్లేక కొద్ది కాలం షూటింగ్ ఆగిపోయింది. ఇక అక్కడ నుంచి వాళ్ల తల్లి దండ్రులు గొడవ చేయడం మొదలెట్టారు. అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చయింది.
అయిందేదో అయ్యింది.. ఇంకా ఖర్చు దండగ.. సినిమా వద్దు ఏమీ వద్దని వారిని తిట్టారు. నేను మొదటి నుంచి వారికి ఖర్చు విషయంలో సలహాలు ఇస్తూనే ఉన్నాను. లైటింగ్‌లు ఎక్కువ పెట్టి తీస్తుంటే వారించాను. కానీ వారు వినలేదు. తీరా స్క్రీన్ మీద చూశాక వారు చెప్పింది కరెక్ట్ అనిపించింది.
దీంతో వారికి సినిమా జ్ఞానం కొద్దిగా ఉందని గ్రహించాను. ఏదైనా మొదటి ప్రయత్నం కనుక వారు ఛాలెంజ్‌గా తీసుకుని మిగిలింది కూడా పూర్తి చేసి విడుదల చేసి అనుకున్న దాన్ని సాధించారు.
చివరగా ఒక ప్రశ్న... హీరోగా నటిస్తూనే కేరెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేస్తారా..?
అందులో తప్పేముంది.. అలాగే చేయడమే ఎంతో మంచిది. ఈ పరంగా చెప్పాలంటే ఎంతో మంది అగ్ర హీరోలు నాకు స్ఫూర్తి. అలాంటి చిత్రాలే త్వరగా ఆదరణ పొందుతాయి. బాలీవుడ్, హాలీవుడ్‌లలోను ప్రస్తుతం అలానే చేస్తున్నారు కదా.. మన దగ్గరా అదే సాంప్రదాయం ఖచ్చితంగా వస్తుంది.