మంచి అమ్మగా నిలబడాలని ఆశిస్తున్నా: సాక్షి
|
చిరంజీవి, మహేష్‌బాబు, నాగార్జున వంటి అగ్రహీరోల సరసన నటించిన సాక్షి శివానంద్.. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగు తెరపై దర్శనమివ్వనుంది.
జేడీ చక్రవర్తి దర్శకత్వంలో రూపొందుతున్న హోమం చిత్రంలో ఓ ఐటెం సాంగ్‌లో తళుక్కుమంటుంది. ఈ సందర్భంగా వెబ్‌దునియా ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ...
సినిమాలకు ఎందుకు దూరమయ్యారో తెలుసుకోవచ్చా..?
జీవితంలో సినిమా ఒకటే కాదు.. చాలా ఉన్నాయి. వాటన్నింటినీ నెరవేర్చాలి. అందులోను నా స్టడీస్‌కు ఆటంకంగా ఉండటంతో అవకాశాలు వస్తున్నా తిరస్కరించాను. అందరూ ఫ్యాషన్ డిజైన్‌లని అంటున్నా.. నాకెంతో ఇష్టమైన జ్యువెలరీ డిజైన్ కోర్సును లండన్‌లో పూర్తి చేశాను.
మరి జ్యువెలరీ కోర్సును చేసి.. మళ్లీ వెండతెరపై నటించడంలో ప్రత్యేక కారణముందా....?
ప్రత్యేక కారణమంటూ ఏదీ పెద్ద లేదు.. హోమం చిత్ర దర్శకుడు జేడీ చక్రవర్తి, హీరో జగపతిబాబు నాకు ఆప్తమిత్రులు.. కనుకే ఈ చిత్రంలో ఐటెం సాంగ్ చేసేందుకు ఒప్పుకున్నా.. టాలీవుడ్ నాకు కొత్త కాకపోయినా.. ఇక్కడ మళ్లీ నటించడం కాస్తంత సంతోషంగా ఉంది. ఇక నా జ్యూవెలరీ కోర్సు అంటే.. దానికి సంబంధించే త్వరలో వ్యాపారాన్ని ప్రధాన నగరాల్లో ప్రారంభించనున్నాను. అలాగే హైదరాబాద్‌లో కూడా ప్రారంభించాలనే అలోచనలో ఉన్నాను.
టాలీవుడ్‌లో ఇది మీ రెండో ఇన్నింగ్స్ అనుకోవచ్చా..?
నో.. ఛాన్స్.. మంచి అవకాశాలు వచ్చినా.. డబ్బు వచ్చినా, రాకున్నా. ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనుంది. నా జీవితంలో నటన అనేది ఒక భాగం మాత్రమే. నేను సాధించాల్సింది చాలా ఉంది. అందుకే నటిగా అవకాశాలొచ్చినా ఇక చాలనుకుంటున్నాను. ఎందుకంటే భవిష్యత్తులో నా పిల్లల ముందు మంచి అమ్మగా నిలబడాలని ఆశిస్తున్నాను.
సముద్రం చిత్రంలో జగపతిబాబుతో నటించడంపై మీ అభిప్రాయం..?
సముద్రంలో బొప్పాయ్ పండు అంటూ ఆటపట్టించారు. వెరీ నైస్.. హుందాగా.. ఎంతో హ్యాండ్‌సమ్‌గా ఉంటాడు. అతని బాడీ లాంగ్వేజ్ అందరికీ ఇష్టపడుతుంది.
హైదరాబాద్‌లో మీ ఫ్లాట్ వివాదం సద్దమణిగినట్లేనా....?
యస్. ఈ విషయంలో మాత్రం మీడియాకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆ ఫ్లాట్ తాలూకు వివరాలు మీడియా ద్వారా బహిర్గతమై నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచాయి. అంతేకాకుండా ఈ విషయంలో సబితా ఇంద్రారెడ్డి కేర్ తీసుకుని సమస్యను పరిష్కరించారు. ఇక్కడ నా స్థలం పక్కనే జేడీ చక్రవర్తి స్థలం కూడా ఉంది. కోర్టులో ఆయన స్థలముందంటూ ముందుకు రావడంతో సమస్య పూర్తిగా సాల్వ్ అయ్యింది.
మీ గ్లామర్ తగ్గలేదు.. రహస్యమేదైనా ఉందా....?
అబ్బో.. అంతేంలేదండి.. తిండి విషయంలో జాగ్రత్తలు పాటిస్తాను. దట్‌మీన్స్ కంట్రోల్‌గా వ్యవహరిస్తాను. ఈ మధ్యే జిమ్, యోగాలకు వెళుతున్నాను.
దేవుడిపై మీకు నమ్మకం ఉందా....?
నమ్ముతాను.. నా చిన్నతనంలో మా నాన్నగారు నన్ను ఇస్కాన్ దేవాలయానికి తరచూ తీసుకెళ్లేవారు. కృష్ణున్ని నేను తరచుగా పూజిస్తుంటాను.
పెళ్లి ఆలోచన చేస్తున్నారా..
ఇప్పట్లో అయితే లేదు. ఓ మూడేళ్ల తర్వాత అని అనుకుంటున్నాను.
ఇండస్ట్రీకి సంబంధించిన వారినే చేసుకుంటారా....?
నో ఛాన్స్.. ఇక్కడ అతి కొద్ది మంది మాత్రమే మంచి వారండి.. మిగిలిన హీరోలందరూ అలా కాదు. అయితే నాకు మాత్రం పెళ్లిపై నమ్మకమున్న వ్యక్తై ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా జ్యువెలరీ వ్యాపారంలో నాకు తొడుగా నిలబడాలి.
