చిత్రసీమలోకి ' ఆనందం ' తో ప్రవేశించి ప్రేక్షకులకు ఇష్టమైన రీతిలో ' ఢీ ' ఇచ్చి అటుపై రవితేజను ' దుబాయ్ శీను ' గా పరిచయం చేసిన సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు శ్రీనువైట్ల ప్రస్తుతం శ్రీను.. స్రవంతి మూవీస్ బ్యానర్‌పై రామ్, జెనీలియాతో మరో హిట్ కోసం "రెడీ" అవుతున్నారు. ఈ రెడీ చిత్రం షూటింగ్ సందర్భంగా శ్రీనువైట్లతో కాసేపు ముచ్చట్లు...
ప్రశ్న... "ఢీ" సక్సెస్ అయిందని ఈ చిత్రానికి "రెడీ" అనే పేరు పెట్టారా? జ... అలాంటి సెంటిమెంటేమీ లేదు. కథ రీత్యా ఈ టైటిల్ బాగుంటుందనిపించింది. ఈ చిత్రంలో హీరో పాత్ర కూడా టైటిల్‌కు అనుగుణంగా ఉంటుంది.
ప్రశ్న... రామ్ పాత్ర గురించి చెప్పండి? జ... ఈ చిత్రంలో రామ్ పాత్ర వైరైటీగా ఉంటుంది. ఇందులో పూర్తిగా పాజిటివ్ పాత్రలోనే కనిపిస్తాడు. ఎవరినీ నొప్పించకుండా తాననుకున్నది సాధిస్తాడు.
ప్రశ్న... అంటే హీరో ఏం సాధించాలనుకుంటాడు? జ... మంచి కుటుంబంలో పెరిగిన హీరోకి అనుకోకుండా హీరోయిన్‌తో ప్రేమలో పడతాడు. అప్పటినుంచి ఎదురయ్యే సమస్యలను అధిగమించి ఏవిధంగా తన ప్రేమను గెలుచుకున్నాడనేది కథాంశం.
ప్రశ్న... ఈ చిత్రంలో జెనీలియా పాత్ర ఎలాంటిది? జ... బొమ్మరిల్లు, ఢీ చిత్రాలతో తెలుగులో గుర్తింపు పొందిన జెనీలియా ఈ సినిమాలో అమెరికాలో పుట్టి పెరిగినా తెలుగు సంస్కృతి సాంప్రదాయాల పట్ల గౌరవం గల అమ్మాయి పాత్రను పోషించింది.
ప్రశ్న... స్క్రిప్ట్‌లకు ప్రాధాన్యమిచ్చే నిర్మాతల్లో రవికిషోర్ ఒకరంటారు. ఆయనతో మీకలాంటి అనుభవం ఎదురైందా? జ... అది మాత్రం నిజమే. స్క్రిప్టు విషయంలో ఆయన చాలా నిక్కచ్చిగా ఉంటాడు. ఆ స్వభావమే ఆయనకు ఇన్ని విజయాలను అందించింది. అందుకే స్క్రిప్టు విషయంలో ఆయనతో చర్చించి సూచనలు తీసుకుంటాం.
ప్రశ్న... ఎక్కువగా దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్‌లో చేస్తుంటారు? మీరిద్దరూ స్నేహితులా? జ... నేను సాగర్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసే సమయంలో స్క్రిప్టు పనిమీద సత్య మూర్తిగారిని కలిసినపుడు దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్స్ విన్నాను. అప్పుడే అనుకున్నాను.. నా సినిమాల్లో సంగీత దర్శకునిగా దేవినే పెట్టుకోవాలని.
అందుకే ప్రతి సినిమాకు దేవిశ్రీనే ప్రిఫర్ చేస్తాను. మా ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలన్నీ కూడా మ్యూజికల్ హిట్ అయ్యాయి అని చెప్పి షాట్ రెడీ కావడంతో శ్రీనువైట్ల తన పనిలో నిమగ్నమైయ్యారు.
|