1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ముఖాముఖి

''పరుగు'' చిరంజీవి కుటుంబానికి సంబంధించింది కాదు: భాస్కర్

పరుగు చిరంజీవి కుటుంబానికి కాదు భాస్కర్
WD PhotoWD
'బొమ్మరిల్లు' చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన ఆ చిత్ర దర్శకుడు భాస్కర్ అంతకుముందు ఎవరికీ తెలియదు. అల్లు అర్జున్ హీరోగా రూపొందిన 'ఆర్య' చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు సుకుమార్ వద్ద భాస్కర్ అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసేవాడు.

'ఆర్య' చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న సమయంలో ఆయన వద్ద ఉన్న భాస్కర్ ఆ చిత్ర నిర్మాత దిల్‌రాజును కలిసి తన వద్ద ఓ మంచి కథ ఉందని చెప్పడం జరిగింది. న్యూ టాలెంట్‌ను ప్రోత్సహించే దిల్‌రాజు వెంటనే భాస్కర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అలా భాస్కర్ దర్శకత్వంలో 'బొమ్మరిల్లు' రూపొందింది.

ఆ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో దిల్‌రాజు తన తదుపరి చిత్రానికి సైతం భాస్కర్‌నే దర్శకునిగా ఎంచుకున్నారు. అలా వారిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రమే 'పరుగు'. గతవారం విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం రెండోవారంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా దర్శకుడు భాస్కర్‌తో సాగించిన సంభాషణ మీకోసం...

తొలి చిత్రం బొమ్మరిల్లు విజయం తర్వాత అదే నిర్మాతతోనే తదుపరి చిత్రాన్ని చేయడానికి ప్రత్యేకంగా ఏదైనా కారణముందా ?
ప్రత్యేకంగా కాకపోయినా ఓ కారణముంది. నాకు దర్శకునిగా జన్మనిచ్చిన దిల్‌రాజు మరో చిత్రాన్ని చేయమని కోరడం, ఆ చిత్రం కూడా బొమ్మరిల్లులాంటి కుటుంబ కథా చిత్రంగా ఉండాలని కోరడంతోనే పరుగు చిత్రం చేయాల్సి వచ్చింది.

బొమ్మరిల్లులో తండ్రి కొడుకుల సంబంధాన్ని చూపించినట్టే పరుగులో తండ్రీ కూతుళ్ల సంబంధాన్ని చూపించారు. ఇందులో కూతురు తండ్రిని కుక్కలా... అని సంబోధిస్తుంది. అలా అనిపించడానికి కారణం ?
కుమార్తెపై మమకారం గల ఓ తండ్రి పడే ఆవేదనను ఈ చిత్రంలో తెరకెక్కించాం. చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడిన తండ్రిని కాదని ప్రియుడితో వెళ్లిపోయిన కుమార్తె తన తండ్రి తనకోసం రాడని అనుకుంటుంది. కానీ తమ వెంటపడి తన భర్తను చంపాలని ప్రయత్నించేసరికి ఆవేశంలో తన తండ్రిని కుక్కలా వెంటపడుతున్నావ్... అంటుంది. అది ఫ్లోలో వచ్చిన డైలాగే తప్ప ప్రత్యేకించి ఏమీ లేదు.


కానీ ఆ సన్నివేశంలో అంతకన్నా బలమైన డైలాగులుంటే బాగుండేదని అనిపించింది. దీనిపై మీరేమంటారు ?
కరెక్టే... కానీ అప్పటికే కథ ఎక్కువైనట్టు అనిపించడంతో డైలాగులు తగ్గించి కేవలం ప్రకాష్‌రాజ్ ఫీలింగ్స్‌తోనే ముగించాల్సి వచ్చింది.

ఈ సినిమాలో లేచిపోయినవారు ఆర్యసమాజంలో పెళ్లి చేసుకోవడం... ఆ తర్వాత సంఘటనలు అన్నీ మెగాస్టార్ కుటుంబానికి సంబంధించిన విషయాల్ని పోలి ఉన్నాయన్న వార్తలు వినిపించాయి. ఆ విషయం మీ దృష్టికి వచ్చిందా ?
పరుగు చిత్రం కథ ఎనిమిదినెలల క్రితం అనుకుని చేసింది. మేం షూటింగ్ చేశాక కొన్ని సంఘటనలు యాదృశ్చికంగా అలా జరిగి ఉండవచ్చు. పైగా ఆర్య సమాజంలో జరిగే చాలా పెళ్లిళ్లు ఇలానే జరుగుతున్నాయి. అయితే ఈ కథను అల్లుఅర్జున్ విన్నారు. చిరంజీవి గారికి కూడా వినిపించాం. ఆయన చాలా బాగుందన్నారు. అప్పటికీ ఈ సంఘటనలు జరగలేదు. కాబట్టి చిత్రానికి, చిరంజీవి గారి కుటుంబంలో జరిగిన సంఘటనలకు సంబంధం లేదు.

ఈ చిత్రాన్ని చూశాక చిరంజీవి నుంచి ఎలాంటి స్పంధన వచ్చింది ?
చిరంజీవిగారు ఈ చిత్రాన్ని చూసి చాలా బాగుందన్నారు. చక్కని సందేశాన్ని ఇచ్చారంటూ ఆయన కితాబిచ్చారు. తండ్రీ కుతుళ్ల సంబంధాన్ని చూపించిన తీరు బాగుందన్నారు. ఒకవేళ పరుగు చిత్రంలో చిరంజీవిగారి కుటుంబానికి సంబంధించిన విషయాలుంటే ఆయనే కట్‌చేయమని చెప్పేవారు కదా.

ఏది ఏమైనా మానవీయ సంబంధాలను చక్కగా తెరకెక్కిస్తున్నారు. మీ తదుపరి చిత్రం ఎలా ఉంటుంది ?
ఇంతటితో ఈ సెంటిమెంట్ చిత్రాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలనుకుంటున్నాను. ఈసారి అందరిని అలరించే ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రం చేయాలనుకుంటున్నాను.

అక్కినేని నాగార్జున కొడుకు నాగచైతన్యతో చిత్రం చేయనున్నారని తెలిసింది ?
ప్రస్తుతానికి అలాంటిదేమీ లేదు. అవన్నీ ఊహాగానాలు మాత్రమే.

అపరిచితుడు విక్రమ్‌తో ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది ?
అవును. అది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఇంతవరకు రాని సెన్సేషనల్ కథతో తెరకెక్కించాలనుకుంటున్నాను. అన్నీ కలిసివస్తే అది ఓ గొప్ప చిత్రం అవుతుంది. దాని గురించి త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తా.
About Writer
Munibabu