ఓ జర్నలిస్టుగా అందరికీ తెలిసిన కె.ఎన్.టి. శాస్త్రి డాక్యుమెంటరీ దర్శకునిగా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఇప్పటివరకు శాస్త్రి తీసింది మూడు చిత్రాలే అయినా జాతీయ అవార్డు గ్రహీతగా పేరు సంపాధించారు. 2004లో శాస్త్రి తిలాదానం చిత్రాన్ని తీసి దర్శుకునిగా జాతీయ అవార్డు సాధించారు.
ప్రస్తుతం ఆయన తీసిన కమ్లి చిత్రం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డుకు ఎంపికయ్యింది. ఈ సందర్భంగా ఆయనతో కాసేపు...
కమ్లి చిత్ర కథ ఎలా పుట్టింది ? రోజువారీ పేపర్లలో వచ్చే న్యూస్ ఆధారంగానే కమ్లి కథ పుట్టింది. గతంలో నేను హార్‌వెస్టింగ్ బేబీ గార్ల్స్ అనే డాక్యుమెంటరీ చేశాను. దాదాపు అలాంటిదే ఈ కథ కూడా. లంబాడీలు తమ పిల్లల్ని అమ్ముకోవడమనే దురాచారాన్ని పత్రికల్లో చదివి కలత చెందాను. దాన్ని సినిమాగా మలచాలనే ఆలోచనలోంచే కమ్లి పుట్టింది.
ఈ కథ కోసం తండా ప్రజలను దగ్గరినుంచి పరిశీలించి ఈ కథ తయారు చేశాను. లంబాడీ మహిళల కడుపులో పెరుగుతోంది ఆడ శిశువు అని తెలియగానే కొందరు సేవాసంస్థల పేరుతో వారి వద్దకు వచ్చి వారికి కొంత డబ్బులిస్తారు. ఆ తర్వాత ఆడ శిశువు పుట్టగానే మరికొంత ముట్టజెప్పి బిడ్డను శిశు విహార్‌కు చేరుస్తారు.
అటుపై దత్తత పేరుతో చట్టపరంగా కార్యక్రమాలు పూర్తిచేసి అరబ్ దేశాలకు అమ్మేస్తారు. ఇలాంటి శిశువులు ఇతర దేశాల్లో పెరిగి పెద్దవారయ్యాక వారిని సెక్స్ వర్కర్లుగా మార్చేస్తారు. ఇలా సాగుతున్న ఈ దురాగతంపై కొంతైనా చైతన్యం తేవడానికే ఈ చిత్రం చేయాలని నిర్ణయించుకున్నాను.
ముందుగా ఈ చిత్రం కోసం ఎవరిని సంప్రదించారు ? ఈ చిత్రం చేయడానికి ఇండస్ట్రీలో ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు. కానీ ఎవరూ ఈ చిత్రం చేయడానికి ముందుకు రాలేదు. ఈ సమయంలో హరిశ్చంద్రప్రసాద్ అనే ప్రవాసాంథ్రుడు అంతకు ముందు నేను తీసిన తిలాదానం చిత్రం చూడాలంటూ అడిగారు. ఆ సందర్భంలో కమ్లి కథ ఆయనకు వినిపించాను. తద్వారా ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చింది.
సహజంగా ఇలాంటి కథలు విన్నప్పడు ఎలాంటి రియాక్షన్ ఉంటుంది ? చాలామంది ఇలాంటి కథలు విన్నప్పుడు చేస్తాం చూస్తాం అంటారు తప్ప నిజంగా ముందుకు రారు. నా అనుభవం ప్రకారం వీడు గత్యంతరం లేకుండా వచ్చాడని తెలిసిన వెంటనే ఎదుటి వారి ప్రవర్తన మారిపోతుంటుంది.
మొదట్లో కమ్లి చిత్రాన్ని సౌందర్యతో చేయాలనుకున్నారట ? అవును. 2004లో నేను తీసిన తిలాదానంకు అవార్డు లభించిన సందర్భంలో ఆ కార్యక్రమంలో సౌందర్యను కలవడం జరిగింది. ఆమె ఈ చిత్రంలో నటించడానికి ముందుకు వచ్చారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై ఆమె కొంత ఖర్చు కూడా పెట్టారు.
అయితే ఆ సమయంలో ఆమెకు మరో చిత్రంలో ఆఫర్ రావడంతో ఈ కథను కొద్దిరోజులు వాయిదా వేయమన్నారు. కానీ అలా చెప్పిన కొద్దిరోజులకే ఆమె మరణించడం జరిగింది. దీంతో కమ్లి ప్రాజెక్ట్ ఆగిపోయింది.