దర్శకుడు తేజ ఎక్కడున్నా అక్కడ ఏదో ఓ సంచలనం చేస్తూనే ఉంటాడు. షూటింగ్‌లో ఉంటే నటీనటుల్ని కొడతాడనీ, నిర్మాతల్ని ఇబ్బంది పెడుతుంటారని విమర్శలువస్తూనే ఉంటాయి. ఆయన మాటలు కూడా పరుషంగానే ఉంటాయి. "చిత్రం"లో టీనేజ్ ప్రేమాయణాన్ని తీసి యువతను ఆకట్టుకున్నా మేథావుల విమర్శలకు గురయ్యారు.
జయం, నువ్వేనువ్వు, నిజం వంటి చిత్రాల తర్వాత ఆయనకు సరైన హిట్స్ లేవు. జగపతిబాబుతో ఫ్యామిలీ సర్కిల్‌లో తీసినా ఆ రూట్ తనకు అచ్చిరాలేదని ఆ తరహా చిత్రాలు విరమించుకున్నారు. ప్రస్తుతం తన స్వంత బేనర్‌లో "కేక" అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చిత్ర వివరాల్ని చాలా గోప్యంగా ఉంచుతున్నా షూటింగ్ మాత్రం 40 శాతం పూర్తయిందని చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ గ్యాప్‌లో ఆయన తెలిపిన వివరాలు...
ప్రశ్న... కేకను కొత్తవారితో చేయడానికి కారణం? జ... నా సంతృప్తికోసం తీస్తున్న సినిమా ఇది. ఇప్పటి జనరేషన్‌కు నచ్చుతుందని భావిస్తున్నాను.
ప్రశ్న... యువతను పెడదోవపెట్టిస్తున్నారనే వార్తలపై మీ అభిప్రాయం? జ... అర్థం పర్ధంలేని ప్రేమ చిత్రాలతో యువతను పెడదోవపెట్టిస్తున్నారనే వార్తల గురించి చెప్పాలంటే... సినిమా ప్రభావం సమాజంపై ఉందనుకుంటే.. ఒక్క తప్పు కూడా సమాజంలో జరుగకూడదు. ప్రేమకథా చిత్రాలే తీసుకుంటే.. వాటి ప్రభావంతో తల్లిదండ్రులు ఎందుకు మారట్లేదు. అన్నీ తెలిసిన తల్లిదండ్రులు పిల్లల ఇష్టానికి వదిలివేయవచ్చు కదా.. నిజం చెప్పాలంటే కొంతమంది మారుతున్నారు. నా ఉద్దేశం సినిమా ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయడం కోసమే. నీతులు చెబుతూ సమాజాన్ని ఉద్దరించే సినిమాలు రావాలని అందరూ అంటున్నారు. వారిని కూడా తీయమనండి. ఈ కోవలోనే "నిజం" సినిమా తీశానుగా ఏమైంది? చెప్పండి.
ప్రశ్న..."కేక" ఎంతవరకు వచ్చింది? జ.. "కేక" సినిమా కొత్తగా ఉంటుంది. ఎనభై శాతం షూటింగ్ పూర్తయింది. ఇటీవలే రాజమండ్రి షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. తర్వాత కలకత్తాలో జరిగే షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది.
ప్రశ్న... స్వంత బేనర్‌పై చేయడానికి కారణం? జ.. మొదట సురేష్ ప్రొడక్షన్స్ చేద్దామనుకున్నాను. టెక్నికల్ సమస్యల కారణంగా అది కుదరలేదు. అందుకే స్వంతంగా మొదలు పెట్టాను. బయట చేస్తే కొన్ని కారణాల వల్ల కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. అదే స్వంతంగా చేస్తే నచ్చకపోతే స్వతహాగా షూటింగ్‌ను నడిపేందుకు ఆస్కారం ఉంటుంది.