1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ముఖాముఖి

నాకు అంత సమయం లేదు: సోనాల్

టాలీవుడ్‌కు వస్తున్న పరభాషా నటీమణుల్లో సోనాల్ చౌహాన్
WD PhotoWD
టాలీవుడ్‌కు వస్తున్న పరభాషా నటీమణుల్లో సోనాల్ చౌహాన్ కూడా చేరింది. "జన్నత్" అనే హిందీ చిత్రంలో నటించిన ఆమెను దర్శకుడు వి.ఎన్. ఆదిత్య చూసి ఆయన నిర్మించే "రెయిన్ బో" చిత్రంలో అవకాశం కల్పించాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మిస్ ఇండియా అయిన ఆమెతో కాసేపు...

ప్రశ్న... నటిగా మీ కెరీర్ ఎలా ప్రారంభమైంది?
జ... ఎంటర్‌టైన్‌మెంట్ ప్రపంచంలోకి అడుగు పెట్టాక ముందు మోడల్‌గా అనుభవం గడించాను. టూరిజంవారు నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచాను. మిస్ ఇండియాగా ఎంపికయ్యాను. దీంతో ఎక్కడికెళ్ళినా చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ గుర్తుపట్టి అభినందించడం మొదలుపెట్టారు. హిందీ చిత్రం "జన్నత్"లో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా ఇటీవలే సక్సెస్ సాధించింది. నా పాత్రకు మంచి గుర్తింపు లభించింది

ప్రశ్న... తెలుగులో అవకాశం ఎలా వచ్చింది?
జ... హార్డ్‌వర్క్‌ని నమ్మేవాళ్ళలో నేనూ ఒకదాన్ని, తీరిగ్గా కలలు కంటూ సమయాన్ని వృధా చేయను. "జన్నత్" పూర్తికాగానే దర్శకుడు వి.ఎన్ ఆదిత్య నుంచి ఫోన్ వచ్చింది. ఆయన చిత్రాన్ని తీర్చిదిద్దే విధానం ఆశ్చర్యం కలిగించింది. ఆయన కూడా కష్టాన్ని నమ్ముతారు. దర్శకుని పనితీరు, సన్నివేశాన్ని తీర్చిదిద్దే విధానం బాగా నచ్చింది.

ప్రశ్న.. "రెయిన్‌బో"లో మీ క్యారెక్టర్?
జ... సినిమాలో నాది చాలా ప్రాధాన్యత గల పాత్ర. టాలీవుడ్ కథానాయిక కావాలనుకున్న ఓ అందమైన అమ్మాయి ప్రేమ కథే ఈ చిత్రం. అసలు ఈ రంగుల ప్రపంచంలోకి ఎందుకు రావాలనుకుంది? తన గోల్ రీచ్ అయిందా? ఈ క్రమంలో ఏం పోగొట్టుకుంది? ఏం సాధించిందో ఆసక్తికరంగా సాగుతుంది. ఇలాంటి కథా చిత్రాలు గతంలో చాలా వచ్చినా, ఇందులో నటించిన ఆర్టిస్టులందరికీ సినిమా కొత్త అనుభూతిని మిగిల్చింది.

ప్రశ్న... తల్లిదండ్రుల సహకారం ఎంతవరకూ ఉంది?
జ... అయిష్టంగానే స్పందిస్తూ.. సాధారణంగా నేను తల్లిదండ్రుల గురించి మాట్లాడను. సపోర్ట్ చేస్తున్నారు.

ప్రశ్న... స్కూల్, కాలేజ్ డేస్ గురించి...?
జ... నేను ఉత్తరప్రదేశ్ అమ్మాయిని. చదువంతా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోనే. ప్రస్తుతం డిస్టెంక్షన్ ఎడ్యుకేషన్ ద్వారా బి.ఏ. (హానర్స్) చదువుతున్నాను. చదువంటే ఇష్టం. అందుకే ఒక వైపు సినిమాల్లో నటిస్తున్నా... మరోవైపు చదువును అశ్రద్ధ చేయటం లేదు. జీవితాంతం చదువుతూనే ఉంటా. జర్నలిజంపై కోర్సు చేయాలనుంది. ఇప్పుడే కాకపోయినా.. మున్ముందు చేస్తాను.

ప్రశ్న.. గుర్తుండిపోయే సంఘటన.?
జ.. నా పుట్టినరోజు నాడు తొలిచిత్రం "జన్నత్" రిలీజైంది. ప్రపంచ వ్యాప్తంగా ఊహించని ఓపెనింగ్స్ వచ్చాయి. థియేటర్స్‌కి వెళ్ళినపుడు ప్రేక్షకులు అభినందించిన తీరు మర్చిపోలేను. ఒక యాక్టర్‌కి ఇంతకంటే ఏం కావాలి.

ప్రశ్న... చేదు సంఘటన?
జ... కేప్‌టౌన్ (దక్షిణాఫ్రికా)లో జన్నత్ షూటింగ్ జరుగుతోంది. బ్రేక్‌లో నగరంలోని అందమైన ప్రదేశాలను చూస్తున్నాను. ఒక్కసారిగా ఒకడు నన్ను డాష్ ఇచ్చి, అసభ్యకరంగా తిట్టడం మొదలుపెట్టాడు. వెంటనే యూనిట్ సిబ్బంది అతన్ని అవతలికి నెట్టేశారు. ఆ రోజంతా అప్‌సెట్ అయ్యాను. యూనిట్ సభ్యులు ధైర్యం చెప్పి ఆ బాధను మర్చిపోయేలా చేశారు.

ప్రశ్న.. అభిమాన నటులు?
జ... కాజోల్, షారూక్ ఖాన్

ప్రశ్న... షారూక్‌తో నటించాలని ఆశపడుతున్నారా?
జ... అవును.. ఆ రోజు వస్తుందని ఆశిస్తున్నాను. మోడలింగ్ సమయంలో ఆయన్ని చూశాను. మాట్లాడే అవకాశం రాలేదు. మరి షారూఖ్ నన్ను చూశారో? లేదో? తెలీదు.

ప్రశ్న.. ఏయే బ్రాండ్స్‌కి మోడలింగ్ చేశారు?
జ.. పెప్సీ, పాండ్స్, హీరోహోండా, నోకియా..

ప్రశ్న... జీవితమంటే..?
జ.. అదొక అందమైన అనుభూతి.

ప్రశ్న... ఎక్స్‌పోజింగ్ విషయానికొస్తే..?
జ.. ఎక్స్‌పోజింగ్ స్టార్‌డమ్ వస్తుందని ఎవరైనా అనుకుంటే.. వాళ్ళకంటే ఫూల్స్ ఎవరూ ఉండరు. ఎక్స్‌పోజింగ్ లేని మెజారిటీ చిత్రాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. వల్గారిటీ లేని చక్కటి చిత్రాలకే ప్రేక్షకులు బ్రహ్మపథం పట్టారు. అవగాహన లేని కొంతమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ మాత్రం ఎక్స్‌పోజింగ్‌ను కలెక్షన్స్ కురిపించే ఆయుధంగా భావిస్తారు. వాళ్ళకీ గ్లామర్, ఎక్స్‌పోజింగ్ మధ్య కన్ఫ్యూజన్ ఉంది.

ప్రశ్న... మ్యారేజ్ గురించి..?
జ... పెళ్ళి ఆలోచనే లేదు. ఈ రోజుల్లో నిజమైన బంధం లేదు. నా స్నేహితుల పెళ్ళిళ్లు ఏమయ్యాయో కళ్ళారా చూస్తున్నాను కదా.

ప్రశ్న.. బాయ్‌ఫ్రెండ్‌కి కూడా చోటు లేదా?
జ... నిజం చెప్పాలంటే... బాయ్‌ఫ్రెండ్ లేడు. అసలంత టైం లేదు. ముందు ప్రొఫెషనల్‌గా ఎదగాలి.
About Writer
Selvi