తెలుగు సినిమా వ్యాపార ధోరణిని కొత్తపుంతలు తొక్కడంలో దగ్గుపాటి సురేష్‌బాబు అందెవేసిన చేయి. నిర్మాణంలో తన తండ్రి రామానాయుడు నుంచి పుణికిపుచ్చుకున్న ఈయన తన సోదరుడు వెంకటేష్ నిర్మించే చిత్రాలకు నిర్మాతగా ఉండేవారు. ప్రస్తుతం బయటి హీరోల చిత్రాలను తన సంస్థ అయిన సురేష్ ప్రొడక్షన్స్‌లో చేస్తూనే ఉన్నారు. తాజాగా రవితేజతో "బలాదూర్" చేస్తున్నారు. మరోవైపు సినిమాల గురించి పూర్తి అవగాహన ముఖ్యమనే ఉద్దేశ్యంతో ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపిస్తున్నారు.
మరోవైపు తన కుమారుడు రాణాను కథానాయకుడిగా పరిచయం చేసే బిజీలోనూ ఉన్నారు. వైజాగ్‌లో తన తండ్రిగారు నిర్మించిన స్టూడియో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానుందని చెబుతున్నారు. సినిమాకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉన్నప్పటికీ తాను మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేస్తున్న డి. సురేష్ బాబుతో కాసేపు...
ప్రశ్న... "బలాదూర్" అనే టైటిల్ పెట్టడానికి కారణం? జ.. రవితేజ సినిమా అంటేనే పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్ అంశాలుంటాయి. ఇది ఒక ఊరిలో ఉన్న ఇద్దరి అన్నదమ్ముల కథ. వారి కుటుంబంలో బలాదూర్‌గా తిరిగే వ్యక్తి కుటుంబ బాధ్యతలను ఎలా మోసాడనేది పాయింట్. రవితేజకునున్న ఫాలోయింగ్ రీత్యా ఆయన మీద టైటిల్ పెడితే బాగుంటుందనుకున్నాం. ఆ విషయాన్నే రవితేజకు చెబితే.. వద్దండి.. కథమీద పెట్టండి అన్నారు. మొత్తానికి "ఇంటికొక్కడు" అనే పెట్టాలనుకున్న టైటిల్‌ను ఆఖరికి "బలాదూర్" వీడికి బాధ్యతలెక్కువ అని పెట్టడం జరిగింది.
ప్రశ్న... ఇంకా కుటుంబకథా చిత్రాలకు క్రేజ్ ఉందంటారా? జ... తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే స్వతహాగా మనం కుటుంబ వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళం కనుక ఆ సినిమాలు తీస్తున్నాం. లవ్ పేరుతో ఎన్నో సినిమాలు వస్తున్నాయి. అయినా వాటికి ఆదరణ తగ్గలేదు కదా? "పోకిరి"లోనూ లవ్ ఉంది. అది ఎంత హిట్ అయిందో తెలుసు కదా. పదేళ్ళ క్రితం ఇదే ఉదయ్‌శంకర్‌తో "కలిసుందాం రా" తీశాం. అప్పుడూ ఇదే మాట అడిగారు. అదీ సూపర్ హిట్ అయింది. మొన్నీమధ్య, అన్నా చెల్లెళ్ళ బంధంతో "గోరింటాకు" తీశారు. అది ఆడుతుందా? అనే ప్రశ్న మొదట్లో తలెత్తింది. కానీ మహిళలు విపరీతంగా ఆదరిస్తున్నారు. మనిషి ఉన్నంతవరకు సెంటిమెంట్ ఉంటూనే ఉంటుంది. అందుకే ఫ్యామిలీ సినిమాలకు ఆదరణ ఉంటుంది. ఒకవేళ ఫ్యామిలీ సినిమా తీస్తే.. ప్రేక్షకులు తిరస్కరిస్తే.. అప్పటి నుంచి తీయడం మానేస్తా...
ప్రశ్న.. మీ సినిమాను ఆల్‌రెడీ కార్పొరేట్ కంపెనీలు కొన్నాయనే వార్తలొస్తున్నాయ్. నిజమేనా? జ.. లేదు. ఇంకా ఎవరూ ముందుకు రాలేదు. ఆల్‌రెడీ తెలుసు సినిమా రంగంలో కార్పొరేట్ వ్యవస్థ వచ్చేసింది. ఇంకా రెండు, మూడు సంవత్సరాల్లో పూర్తిగా దూసుకుపోతుంది. అప్పుడు నిర్మాణ రంగంలోనూ, మార్కెట్ రంగంలోనూ మార్పులు వస్తాయి. ముంబైలో యాడ్ ల్యాబ్స్ సినిమాలు యూటీవీ కొంటుంది. వారి సినిమాలు వీరూ వీరి సినిమాలు వారు అలానే కొనేస్తారు. అలా ఒక్కోసారి అమ్మిన తర్వాత హిట్ అయినవీ, ఫ్లాప్ అయినవీ ఉంటాయి. ఇదంతా మార్కెట్‌ను పెంచే దిశగా పయనించేవే. త్వరలో తెలుగు సినిమా మార్కెట్ మరింత విస్తృతంగానుంది.