"ఇంద్ర"కు మించిన ఆదరణ : ఆర్.బి. చౌదరి
|
ప్రశ్న... సీరియల్స్‌లోనే "సెంటిమెంట్" భారీ ఎత్తున ఉందిగా.. సినిమా తీయడానికి కారణం?
జ... ఏదైనా సెంటిమెంట్‌కు ఆదరణ ఉంటుందని భావించి సినిమా తీశాం. కన్నడలో అన్నా-తంగి మేమే చేశాం. దాన్ని తెలుగులో కూడా చేయాలనుకున్నాం. కానీ షూటింగ్ సమయంలో పలు కారణాలవల్ల ఆలస్యం కావడంతో సినిమాపై నమ్మకం పోయింది. పైగా అన్నాచెల్లెల సెంటిమెంట్ కథలు చాలానే వచ్చాయి. సీరియల్స్ కూడా వస్తున్నాయి. ఐటెక్ యుగంలో ఇంకా చూస్తారో? లేదో? అనే సందేశం కూడా కలిగింది. చివరికి ఎలాగోలా రిలిజ్‌చేసి చేతులు దులుపుకుందాం అనుకున్నాం. కానీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మీరాజాస్మిన్ పాత్రను అన్నలంతా తమ చెల్లెలుగా భావిస్తున్నారు. చాలామంది అన్నలు విదేశాల్లో ఉన్న తమ చెల్లెళ్ళకు ఫోన్లుచేసి వాకబు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే... వారినెంతగా దగ్గర చేసిందో అర్థమవుతుంది.
ప్రశ్న... రాజశేఖర్ డేట్స్ ప్రాబ్లమ్ తెలిసి ఎందుకు ఆగారు?
జ... అటువంటి పాత్రను ఆయనే చేయగలరు. గతంలో మా బేనర్ లో "సింహరాశి" చేశారు. అంత ఎమోషనల్ ఆయనకే సాధ్యం. రాజశేఖర్ సింహరాశి కంటే పెద్దహిట్ గోరింటాకు ఇచ్చింది. ఈ సక్సెస్ ఆయన ఊహించలేదు. ఇంటర్వ్యూ కావాలని ఎవరైనా అడిగితే... తాను నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ కాన్సిల్ చేసుకుని మరీ ఇస్తున్నాడు. ముఖ్యంగా 'బి', 'సి' సెంటర్లలో మహిళలు ఎక్కువగా ఆదరిస్తారన్నారు. రెండు వారాల్లో మాకందిన వివరాలను బట్టి పరిశీలిస్తే కొన్నిచోట్ల "ఇంద్ర"ను మించిన ఆదరణ కనబడుతోంది. అలాగే దర్శకుడు ప్రతాప్‌కు "నువ్వువస్తావని" తర్వాత హిట్స్ లేవు. "గోరింటాకు" ఇచ్చిన ఆనందంతో ఉబ్బితబ్బిబ్బుతున్నాడు. ఆ ఆనందంతో యూనిట్ అంతా తిరుపతి వెళ్ళివచ్చాం.
ప్రశ్న... తమిళ చిత్రానికి ప్రేరణ "గోరింటాకు" అంటున్నారు?
జ... "రక్తసంబంధం" రాకముందు అంటే 45 ఏళ్ళక్రితం తమిళంలో అన్నాచెల్లెల్లు సెంటిమెంట్ మీద వచ్చిన చిత్రాన్ని ఆనాడు ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. ఆ కథలో చాలా చిత్రాలు వచ్చాయి. ఈ చిత్రంలో చెల్లెలు పాత్రకు ఆరుగురు సంతానం. వారితో పాటు ఆమె కూడా చనిపోతుంది. గోరింటాకులో ముగ్గురు పిల్లలుగా చూపాం. మొత్తానికి స్పీడ్ యుగమైనా మానవతావిలువలు మార్చిపోలేదు. నన్ను చాలా మంది ఎప్పడూ ఫ్యామిలీ సినిమాలే తీస్తుంటారా? అని అడుగుతున్నారు... సూపర్‌గుడ్ ఫిలిమ్స్ కుటుంబమంతా కలిసి చూసే చిత్రాలనే నిర్మిస్తుంది. ఎందుకంటే మసాలా చిత్రాలు తీస్తే ఒక్క టిక్కెట్టే తెగుతుంది. ఫ్యామిలీ అయితే పది టికెట్లు తెగుతాయి.
ప్రశ్న... నిర్మాతగా మీ కెటువంటి గుర్తింపు వచ్చింది?
జ... సినిమాకు ఆర్టిస్టులే ముఖ్యం. ఎక్కడకు వెళ్ళినా వారినే గుర్తుపడతారు. నిర్మాత తెరవెనుక మనిషి. కొద్ది నిర్మాతలు మినహా ఎవరూ గుర్తుపట్టరు. మా బేనర్‌పై వచ్చిన చిత్రాల ప్రభావం వల్ల ఇటివలే మలేషియా... సింగపూర్ వెళ్ళితే... అక్కడ... సూర్యవంశం... నిర్మాతలు అంతా వచ్చి పరిచయం చేసుకున్నారు. ఇప్పుడు గోరింటాకు నిర్మాతగా అందరికీ తెలిసిపోయింది.
ప్రశ్న...ఎస్.ఎ రాజ్‌కుమార్‌నే ప్రతి సినిమాకు ఎంచుకోవడానికి కారణం?
జ... మా బేనర్‌లో కొత్తవారిని పరిచయం చేయడం అలవాటు. టాలెంట్ ఉంటే ప్రోత్సహిస్తుంటాం. ఆ కోవలో ఎస్.ఎ రాజ్‌కుమార్‌ను తెలుగుకు పరిచయం చేశాం. ఆయన పని విధానం నచ్చి కంటెన్యూగా ఆయన్నే తీసుకుంటున్నాం. మెలోడీ పాటలు బాగా చేయగలడు. తమిళంలో వేరే మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు. అలాగే డాన్స్ డైరెక్టర్ ప్రేమ్‌రక్షిత్, దర్శకుడు కె.ఎస్. రవికుమార్, కెమెరా మెన్లు, ఇలా ఎందరినో పరిచయం చేశాం. వారాంతా ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నారు.
ప్రశ్న...మీ అబ్బాయి "జీవా"తో తెలుగులో ఎప్పుడు సినిమా తీస్తున్నారు ?
జ... మా అబ్బాయి జీవా, దర్శకుడు చేరణ్ కాంబినేషన్‌లో ఓ చిత్రాన్ని ఆగస్టులో ప్లాన్ వేస్తున్నాం. వివరాలు త్వరలో తెలుపుతాం.
