అడవి చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారిన రామ్‌గోపాల్ వర్మ కొత్తగా ఎలక్ట్రానిక్ మీడియాను ఎటాక్ చేశారు. సమాజాన్ని రాజకీయ మీడియా భ్రస్టు పట్టిస్తోందని విమర్శల వర్షం కురిపించారు. ఇదిలావుంటే ఆయన తీసిన రణ్ చిత్రం మీడియాపై డెరెక్ట్ అటాక్ చేస్తూ రూపొందించిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో రాముతో వెబ్‌దునియా ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. ఆ వివరాలు మీకోసం....
ప్రశ్న: మీ "రణ్" చిత్రం టైటిల్‌ను జనగణమన"రణ్"అధినాయక జయహే అని మార్చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై మీరేమంటారు..? వర్మ: అవును మార్చాను. అప్పటి జనగణమన దేశభక్తి వేరు. ఇప్పటి దేశభక్తి జనగణమన వేరు. అందుకే జనగణమన "రణ్" అన్నా.
ప్రశ్న: రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన జనగణమన గీతాన్ని మొత్తంగా మార్చేసి మధ్యలో రణ్ తీసుకురావడం ఎంతవరకు సబబు... మీకసలు దేశభక్తి ఉందా.. అని కొందరు విమర్శిస్తున్నారు? వర్మ: నాకు దేశభక్తి లేదు. విశ్వభక్తి వుంది.
ప్రశ్న: మీ జనగణమన "రణ్" ప్రయోగం వల్ల ఠాగూర్ ఆత్మ క్షోభిస్తుందని కొందరు అంటున్నారు. దీనిపై మీ కామెంట్? వర్మ: విశ్వకవి ఠాగూర్ నాటి పరిస్థితులను అద్దం పడుతూ ఆ మహా గీతాన్ని రచించారు. నేను నేటి పరిస్థితులను ఏకరవు పెడుతూ అదే గీతం ద్వారా చెప్పదలచుకున్నా.
ప్రశ్న: ఈ వివాదస్పద గీతంపై కోర్టులో కేసు నడుస్తోందని...? వర్మ: అవును. నడుస్తోంది. కొందరు డైరెక్టుగా నాతోనే అంటున్నారు. వాళ్లందరికీ నే చెప్పేదొకటే. నాకు రవీంద్రుని గీతాన్ని కించపరిచే ఉద్దేశ్యం ఏమాత్రం లేదు. కాకపోతే ఈనాటి పరిస్థితులను ఆ గీతం ద్వారా చెప్పదలుచుకున్నా.
ఒకటి మాత్రం నిజం. కింది కోర్టులో ఓడిపోయినా సుప్రీం కోర్టుకైనా వెళ్లి జనగణమన"రణ్"కు క్లీన్ సర్టిఫికేట్ తెచ్చుకుంటా... అంతవరకూ పోరాడుతూనే ఉంటా.
ప్రశ్న: "రణ్"లో మీడియాపై ధ్వజమెత్తారని అంటున్నారు.... వర్మ: అవును... గోరంతలు కొండతలు అనే నానుడు మీడియాకు కరెక్టుగా ఎలా సరిపోతుందో చూపే ప్రయత్నం చేశాను.
ప్రశ్న: మీడియా సమాజాన్ని పక్కదోవ పట్టిస్తోందంటున్నారు.. మరి మీరు చేసేదేమిటి? హీరోయిన్లకు జానా బెత్తెడు దుస్తులు వేయడం ఎటువంటి సంస్కృతి..? వర్మ: అది మా వ్యాపారం. వ్యాపారంరీత్యా అలా చేయక తప్పదు. కానీ మీడియా పని వేరు కదా.. మీడియా మీడియాలానే వ్యవహరించాలి.
ప్రశ్న: తెలుగులో సినిమా చేయను అని చెప్పారు కదా.. మరి ఇప్పుడు "రక్త చరిత్ర" చేయడానికి కారణమేమిటి..? వర్మ: ఇప్పుడు చరిత్ర మారింది. కనుక చేస్తున్నాను.
ప్రశ్న: మీ సినిమాలో ఏ హీరోయిన్‌ను పరిచయం చేసినా వారితో లింక్ ఉన్నట్లు వార్తలొస్తుంటాయి. దీనిపై మీరేమంటారు..? వర్మ: మీడియా గురించి ఇంతకుముందే చెప్పాను కదా.. ఇదీ అంతే. మరీ అంత నమ్మకం లేకపోతే.. మా ఇంటికి రండి. ఎంత మంది అమ్మాయిలున్నారో చూద్దురు. అని ఫినిషింగ్ టచ్ ఇచ్చారు రామ్‌గోపాల్ వర్మ