కథక్ నృత్యకారిణిగా స్థిరపడాలనుకుని సినీరంగంలో అడుగుపెట్టిన భామ శ్రియ. ఈ ఢిల్లీ బామకు ప్రత్యేకించి పరిచయాలు అవసరంలేదు.
టాప్‌హీరోయిన్ల రేంజ్‌లో పోటీపడుతుంది. సౌందర్యం గురించి ప్రత్యేక శ్రద్ధకూడా తీసుకుంటున్నానని చెబుతున్న శ్రియ తాజాగా లక్స్ సోప్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. అందులో భాగంగా పలు ప్రాంతాల్లో శ్రియ పర్యటిస్తుంది. ఈ సందర్భంగా ఆమెతో జరిపిన చిట్‌చాట్.
ప్రశ్న: మీ సౌందర్య రహస్యమేమిటి? జ: బాహ్య సౌందర్యాన్ని ప్రతిఫలించేది మనం తీసుకునే ఆహారమే. ఉదయాన్నే పాలు, గుడ్డులోని తెల్లసొనతో చేసిన ఆమ్లెట్ తింటాను. తర్వాత ఇతర పండ్లు తింటాను. రోజూ స్విమ్నింగ్, యోగా చేస్తాను.
ప్రశ్న: యోగా చేస్తున్న మీరు ఆయుర్వేదానికి ప్రచారం చేయకుండా లక్స్‌కు చేయడానికి కారణం? జ: సౌందర్య సబ్బు అనే పేరు ఆ లక్స్ సోప్‌కి ఉంది. మా ఇంట్లో అందరూ అదే ఉపయోగిస్తాం. నాకంటే ముందు అగ్రహీరోయిన్లుకూడా లక్స్ సోపుకు ప్రచారం చేశారు. ఐశ్వర్యారాయ్‌కూడా చేసింది. లక్స్‌లో ఆరోగ్యానికి హానిచేసేవి ఏమీలేవు.
ప్రశ్న: మీ జీవితంలో తీరని కోరిక ఏమైనా ఉన్నదా? జ: కథక్ నేర్చుకున్న నేను సినీరంగంలో వస్తానని అనుకోలేదు. కానీ సినీపరిశ్రమలో నాకున్న గుర్తింపు, అభిమానులు కథక్‌లో వచ్చేవి కావు. కానీ చిరకాలకోరిక ఒకటుంది. నృత్యనేపథ్యంలో సాగే సినిమాలో నటించాలి.
ప్రశ్న: ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఎక్స్‌పోజింగ్ ఎక్కువగా చేస్తున్నారు? జ: అది నా తప్పుకాదు. నా దగ్గరకు వచ్చేపాత్రలు అలా వస్తున్నాయి. గతంలో వచ్చిన పాత్రలకు అది అక్కర్లేకపోయి ఉండవచ్చు. ఇప్పుడు చేస్తున్న పాత్రలు తప్పనిసరై ఉండవచ్చు. తెరపై కన్పించేది నాకు నచ్చిన శ్రియకాదు. దర్శకుడికి నచ్చినట్లు.. ఎక్స్‌పోజింగ్ పాత్ర. అదికూడా అవసరమైన మేరకే కన్పిస్తుంది.
ప్రశ్న: కొత్తగా చేసే చిత్రాలు? జ: ప్రస్తుతం మల్లన్న విడుదలకు సిద్ధంగా ఉంది. మరో రెండు తమిళ చిత్రాలున్నాయి. తెలుగులో చర్చలు జరుగుతున్నాయి.
ప్రశ్న: సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిసింది? జ: లేని వాళ్లకు పెట్టడంలో ఉన్న ఆనందం ఎందులోనూ లేదు. చిన్నతనంలోనే అనుకున్నదానికంటే ఎక్కువ సంపాదించా. అందుకే కొంతమంది పేదపిల్లల చదువు కోసం సాయం చేస్తున్నా.